వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీతా రెడ్డి అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు వెల్లడైనప్పటి నుండి ముఖ్యమంత్రి ఈ కేసు పట్ల తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు ఆమె తెలిపారు.
అంతేకాకుండా, ఆ కేసు నుండి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సిబిఐ దర్యాప్తు ముందుకు జరగకుండా అడ్డంకులు కూడా కల్పిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా నవంబర్ 19, 2021న ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ కేసులో అవినాశ్ రెడ్డికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చారని సునీత గుర్తు చేశారు. మొదటిసారిగా, వివేకానందరెడ్డి హత్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందు సీఎం జగన్ పేరు చోటుచేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆమె సుప్రీంకోర్టుకు నివేదించారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డిల పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు కొన సాగనీయకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఇలా ఉండగా, నవంబర్ 19, 2021న డి. శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సీబీఐ హాజరు పరిచినప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాల పాటు శివశంకర్ రెడ్డితో గడిపారని, అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సీబీఐ అధికారులను అవినాశ్ రెడ్డి బెదిరించారని ఆమె గుర్తు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహామేరుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డిని, డి. శివశంకర్ రెడ్డిని (ఏ5) ని గుడ్డిగా సమర్ధిస్తూ మీడియా ముందు మాట్లాడుతుండడాన్ని ఆమె తన పిటీషన్ లో ప్రస్తావించారు. సీబీఐపైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు. సజ్జల ప్రభుత్వంలో శక్తివంతమైన వ్యక్తి అని, ఆయనే ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్నారని ఆమె చెప్పడం గమనార్హం.
అదే రోజు సజ్జల విలేకరుల సమావేశంలో నిందితులకు మద్దతుగా మాట్లాడిన తర్వాత ఫిబ్రవరి 16, 2022న కడప జ్యుడిషియల్ మాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి (అవినాశ్ రెడ్డి అత్యంత సన్నిహితుడు) సీబీఐ అధికారి రాంసింగ్‌పై చేసిన ఫిర్యాదును స్వీకరించి, కడప పోలీసు స్టేషన్‌కి పంపించారని సునీత తన పిటిషన్‌లో వెల్లడించారు.
ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ మూడ్రోజుల కింద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సునీతారెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
“ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా అవినాశ్‌రెడ్డిని 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లి తప్పుచేసింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం” అంటూ ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పేర్కొంటూ ఈ క్రమంలో ఎటువంటి ఆంక్షల్లేకుండా దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె తన పిటీషన్ లో కోరారు. అయితే, ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు విధించిన గడువుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా హైకోర్టు ఈ కీలక దశలో దర్యాప్తును పక్కదోవ పట్టించిందని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు.