అవినాష్ మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో సునీత అభ్యంతరం

Wednesday, December 18, 2024

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మిస్టరీ కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే రోజు రోజుకూ శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. తాజా అరెస్ట్ ల నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశముందని భావించిన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. చీఫ్‌ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట సునీత దాఖలు చేసిన పిటీషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. పిటిషన్‌ శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ తెలిపారు.

అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మెరిట్ ప్రకారం లేవని, దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తీసుకోవడం సరి అయింది కాదని సునీతారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో స్పష్టం చేశారు. 

వివేకా హత్య కేసు దర్యాప్తుపై గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కీలక దశలో ఉందని.. న్యాయస్థానం ఆదేశాల మేరకు హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని చేధించే పనిలో సీబీఐ దర్యాప్తు జరుగుతోంద ఆమె తెలిపారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా సీబీఐ దర్యాప్తు జరిపేలా అనుమతించాలని ఆమె కోరారు.

ఈనెల 30వ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రాధాన్యతను పట్టించుకోకుండానే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో దర్యాప్తుకు అవరోధాలు కలిగించేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని సునీతా రెడ్డి తన పిటిషన్‌లో స్పష్టం చేశారు.

వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, 25వ తేదీ వరకు అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి ఉపశమనం పొందారు. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. 25వ తేదీన తుది తీర్పు తెలంగాణ హైకోర్టు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సునీత సవాలు చేశారు.

హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యలో అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

‘‘హత్య చేసినట్లుగా ఒప్పుకొంటే కోట్లు ఇస్తామని గంగాధర్‌ రెడ్డికి ఆఫర్‌ ఇచ్చారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌ రెడ్డి చెప్పినట్లు అప్పటి సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పిటిషనర్‌ ఆధారాలను నాశనం చేశారు. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని స్వయంగా సుప్రీంకోర్టు గుర్తించింది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా కొలేటరల్‌ ఎవిడెన్స్‌ ఉంది’’ అని వివరించారు.

అవినాశ్‌ రెడ్డి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని, దర్యాప్తు సవ్యంగా సాగుతోందని స్పష్టం చేసిందని రవిచందర్‌ గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు మరో పిటిషన్‌తో కోర్టుకు వచ్చారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో దస్తగిరి క్షమాభిక్షను వ్యతిరేకిస్తూ వాదనలు చేస్తున్నారు. ఇదేం పద్ధతి? దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని అన్ని స్థాయిల కోర్టులు ధ్రువీకరించాయి’’ అని గుర్తు చేశారు.

హైకోర్టు ధోరణిలో ఇంతలోనే ఇంతగా మార్పు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.  మరోవైపు అవినాష్ రెడ్డి రోజూ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.  25వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పిన కోర్టు.. నిత్యం విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles