ఒక బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసులో మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, ఆ బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ ఎదురు చూస్తుండడంతో దిక్కుతోచక, అన్ని అధికార కార్యక్రమాలను రద్దు చేసుకొని, తాడేపల్లి ప్యాలెస్ లో అంతరంగికులతో మంతనాలు జరుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి `లోబీయిస్టు’గా పేరున్న మైసూర్ స్వామిజి విజయకుమార్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి, ఆదివారం జగన్ తో భేటీ కావడం పలు ఊహాగానాలకు ఊతమిస్తున్నది.
కేవలం ఈ కేసు నుండి తమ కుటుంబాన్ని బైటపడవేసుకోవడం కోసమే, మరో మార్గం లేక, ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ద్వారా ఆ స్వామీజీని రప్పించారని మీడియా కధనాలు రావడంతో వైఎస్ జగన్ శిబిరం ఖంగారు పడినట్లు కనిపిస్తున్నది. భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడంతో నష్ట నివారణ కోసం పొలిటికల్ ఫిక్సర్లు రంగంలోకి దిగారని విస్తృత ప్రచారం జరుగుతోంది.
మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం కర్ణాటకకు చెందిన జ్యోతిష్యుడు, గ్రానైట్ వ్యాపారి విజయవాడకు వచ్చారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మైసూరు నుంచి హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌ను విజయవాడకు తీసుకురావడంతో నవయుగ సంస్థకు చెందిన చింతా శశిధర్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
దానితో, జగన్ బాబాయి, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మంగళవారం మీడియా ముందుకు వచ్చి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో లాబియిస్ట్ విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వద్దకు పిలిపించుకున్నారంటూ వస్తున్న వార్తలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.
ఆ స్వామిజి వేరేపని మీద విజయవాడకు వస్తే, తానే `ఆశీర్వదంకోసం’ జగన్ తో సమావేశం ఏర్పాటు చెశానని చెప్పడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. రామోజీరావు వియ్యంకుడి విమానంలో, వారి పనులపై విజయవాడకు వస్తే, 2007 నుండి తనకు పరిచయం ఉండడంతో ముఖ్య మంత్రికి ఆయన ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతోనే ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేసినట్లు ఆయన సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు.
విజయ్ కుమర్ వేరే కార్యక్రమం కోసం విజయవాడ వస్ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎందుకున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. విజయవాడలో వేరే కార్యక్రమానికి గానీ, ఇంకెక్కడికైనా ఆయన ఎందుకు వెళ్లలేదని నిలదీస్తున్నారు.
కాగా, పక్షపాత ధోరణిలో సిబిఐ దర్యాప్తు జరుగుతుందని, అవినాష్ రెడ్డి బయట పెట్టిన విషయాల ఆధారంగా దర్యాప్తు సాగడం లేదని అంటూ సిబిఐని దుమ్మెత్తిపోయడంలో అవినాష్ రెడ్డితో సుబ్బారెడ్డి స్వరం కలిపారు. సిబిఐను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు.
2004-09 మధ్య కాలంలో వైఎస్‌తో సన్నిహితంగా నవయుగ సంస్థ ఆ తర్వాత వైఎస్ జగన్‌కు దూరమైంది. 2019లో పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించిన తర్వాత శశిధర్, జగన్ ఎలా దగ్గరయ్యారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.
తాజాగా సంక్షోభ నివారణ క్రమంలో చింత శశిధర్ పేరు తెరపైకి వచ్చింది. మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో విజయ్‌కుమార్‌ను విజయవాడ తీసుకువచ్చి ఆ తర్వాత అదే విమానంలో హైదరాబాద్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ స్వామిజీని తాము విజయవాడ తీసుకురాలేదని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేయడం గమనిస్తే ఆత్మరక్షణలో పడినట్లు పలువురు భావిస్తున్నారు.