బిఆర్ఎస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ!

Friday, November 22, 2024

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండవచ్చని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంపుతున్న సంకేతాలకు పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ ముగింపు పలికారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సోమవారం సాయంత్రం చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ తో పొత్తు గురించి కొందరు చేస్తున్న వాఖ్యల గురించి ప్రస్తావనకు రాగా అటువంటి ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణాలో బీజేపీ పరిష్టితి గురించి కూడా ఆయన ఆరా తీయడం గమనార్హం. పలువురు బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణాలో తరచూ పర్యటనలు జరపడం గురించి కూడా అడిగారు.

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ తో బిఆర్ఎస్ కలసి వచ్చినా లోక్ సభ ఎన్నికలకన్నా ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఒంటరిగానే కాంగ్రెస్ పోటీచేస్తుందనే స్పష్టత ఈ సందర్భంగా రాహుల్ ఇచ్చారు. దానితో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బిఆర్ఎస్ తో పొత్తు ఉండదంటూ ప్రకటనలు చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పెద్ద రిలీఫ్ ఇచ్చినట్లయింది.

బిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ప్రస్తుతం రెండు పార్టీలకు నష్టదాయకం కాగలదని, బిజెపికి లాభం చేకూర్చగలదని ఈ సందర్భంగా పలువురు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ తో చేతులు కలపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ మూట కట్టుకోవలసి వస్తుంది. మరోవంక బిజెపి మాత్రమే ప్రతిపక్షంగా నిలబడి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉందనే అంశాన్ని బిజెపి ప్రజా క్షేత్రంలో ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలని హెచ్చరించారు. దీనికి చెక్ పెట్టడానికి తాము బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.

‘తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎలా ఉంది? అలాగే మైనారిటీలు ఏ మేరకు ప్రభావం చూపనున్నారు?’ అని అడగడం ద్వారా తెలంగాణలో ఈ సంవత్సరం చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి సారింపగలమని, పలువురు కాంగ్రెస్ జాతీయ నేతలు సహితం తెలంగాణాలో పర్యటనలు జరుపగలరని రాహుల్ వారికి చెప్పారు.

 బీజేపీ జాతీయ నాయకులు పదేపదే రాష్ట్రంలో పర్యటిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ చాలా బలహీనంగా ఉందని రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలన్నదానిపైనా నాయకుల అభిప్రాయాలను రాహుల్‌ సేకరించారు.

 ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలచుకునేందుకు చేపట్టాల్సిన చర్యలనూ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలతో నష్టపోయిన వర్గాలను కలిసి, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, బీసీ కుల గణన అంశంపైనా దృష్టి పెట్టాలని పొన్నాల, మధుయాష్కీ అభిప్రాయడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles