ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నేతృత్వాన్ని సీనియర్ నేతలు సహించలేకపోతున్నారు. తాము సహాయ నిరాకరణ చేస్తున్నా అతను దూసుకు పోతుండటం, పార్టీ అధిష్ఠానం అతనికి మద్దతుగా ఉంటుండడంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోపుగా రేవంత్ రెడ్డిని సాగనంపే ఎత్తుగడలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ టిపిసిసి అధ్యక్షుడిగా కొనసాగితే అభ్యర్థుల ఎంపికలో తమను ఆటబొమ్మలుగా మారుస్తాడనే భయం వారిని వెంటాడుతున్నది.
మొదటినుండి రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టడం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ, చివరకు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి పంపి అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు విఫల ప్రయత్నం చేసి విఫలమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మరో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే `దళిత్ సీఎం’ చేస్తామని హామీ ఇవ్వాలని చెబుతున్నారు. ఈ మాట కేవలం రేవంత్ కాంగ్రెస్ గెలుపొందిన సీఎం కాకుండా చేయడం కోసమే అని స్పష్టం అవుతుంది.
దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంను ఆవిష్కరించడం ద్వారా కాంగ్రెస్ కు ఓటుబ్యాంక్ గా ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తుగడ వేయడంతో కాంగ్రెస్ ఆలోచించుకోవలసి వచ్చింది. పైగా,దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు జరుపుతామని అంటూ ప్రకటించారు. దానితో కేసీఆర్ కాంగ్రెస్ కు ముప్పుగా మారారని సంకేతం ఇచ్చిన్నట్లయింది.
దీనిని ఆసరాగా తీసుకొని విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదని అంటూ 16శాతం ఉన్న మాదిగలకు ఇప్పటికీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించలేదని ప్రశ్నించారు. దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందఐ పేర్కొన్నారు.అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని ఖర్గేని కోరతామని సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ `దళిత సీఎం’ అంటూ ప్రకటనలు చేసి, తీరా 2014లో అధికారం రాగానే తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా ఉండటం తెలిసిందే. ఈ మాటను బట్టే కేసీఆర్ ను `దళిత వ్యతిరేకి’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రతిపాదనను రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే తీసుకొచ్చారన్నది బహిరంగ రహస్యమే.
ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా పార్టీలో తనకు పోటీగా ఉన్న రేవంత్ రెడ్డికి చెక్ చెప్పొచ్చని ఆయన భావిస్తున్నట్టు సర్వత్రా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏ రాష్ట్రంలో కూడా ముందుగా బిజెపి అభ్యర్థి గురించి ప్రకటనలు చేయడం లేదు. ఆ విధంగా చేయడం మరికొన్ని సమస్యలకు దారితీయవచ్చని భయపడుతున్నాయి. ఏదేమైనా కోమటిరెడ్డి ప్రకటన రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు ఏమేరకు దోహదపడుతుందో గాని కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇరకాటంలో పడవేస్తుంది.