కొన్ని రోజుల కిందట కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. అది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వెంట, కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాబోతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ‘మా తమ్ముడేనయ్యా’ అని సీఎం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారు పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్ అయింది.
ఆ తరహాలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి తన మామయ్య గురించి భద్రతా సిబ్బందికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారో లేదో తెలియదు. కానీ.. జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి దారుణమైన పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా.. మార్కాపురంలో హెలిపాడ్ వద్దకు వెళుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు. పాపం.. ‘ఆయన మా మామయ్యేనయ్యా’ అని సీఎం సర్దిచెప్పడానికి కూడా కుదర్లేదు. సీఎం మార్కాపురం చేరుకోవడానికి ముందే ఈ పరాభవపర్వం జరిగిపోయింది.
బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి పోయినప్పటికీ.. ఆయన పార్టీలో ప్రాంతీయ సమన్వయ కర్త హోదాలో కీలకంగానే ఉన్నారు. మార్కాపురం హెలిపాడ్ వద్దకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకుని వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. పోలీసులపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా, వాగ్వాదానికి దిగినా ఫలితం దక్కలేదు. ఆయనకు నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ ఇతర నేతలు ప్రయత్నించినప్పటికీ.. ఆయన దిగిరాలేదు. అలిగి హెలిపాడ్ వద్దకు రాకుండానే, ఈబీసీ నిధులను విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆయన ఒంగోలుకు తిరిగి వెళ్లిపోయారు. బాలినేని వెంట.. ఆయన అనుచరులు, ఒంగోలు నగర మేయర్ కూడా జగన్ కార్యక్రమం వైపు రాకుండా వెళ్లిపోయారు.
జగన్ మామయ్య బాలినేనికి పరాభవాలు కొత్త కాదు. మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చేయాలని జగన్ ఆలోచిస్తున్న సంగతిని తొలుత ఆయనే బయటపెట్టారు. తర్వాత కొందరిని జగన్ కొనసాగిస్తారనే ప్రచారం సాగింది. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురికి మాత్రం మంత్రి పదవి ఉంటుందని మిగిలినవారిని మారుస్తారని బాగా ప్రచారం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ లకు ఉద్వాసన ఉండదని అప్పట్లో అంతా అన్నారు. ఆ ముగ్గురూ పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలనే ప్రచారం కూడా సాగింది. అయితే.. ఆ ఇద్దరూ రెండో మంత్రివర్గంలో కంటిన్యూ అయ్యారు గానీ, బాలినేనికి ఉద్వాసన తప్పలేదు. ఇది ఆయన అప్పట్లో చాలా అవమానంగా భావించారు. అయితే.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అనే మొక్కుబడి పదవి ఇచ్చి జగన్ కాస్త ఊరడించారు. తాజాగా కనీసం ముఖ్యమంత్రి హెలిపాడ్ వద్దకు వెళ్లడాన్ని కూడా అడ్డుకుంటూ జరిగిన అవమానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. అందుకు ఆయన అనుచరులతో కలిసి అలిగి కార్యక్రమానికి రాకుండానే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మామయ్య అలకతో జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఆయన చొరవ తీసుకోవడంతో.. సీఎంఓ అధికారులు స్వయంగా బాలినేనికి ఫోనుచేసి మాట్లాడారు. జగన్ తరఫున బుజ్జగించారు. అనంతరం బాలినేని మళ్లీ జగన్ పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈబీసీ నేస్తం పేరుతో బటన్ నొక్కి నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని.. జగన్ మార్కాపురంలో నిర్వహించారు. అలిగి వెళ్లిపోయిన తర్వాత.. మళ్లీ సభాకార్యక్రమానికి వచ్చిన మామయ్య బాలినేనిని జగన్ బటన్ నొక్కే సమయంలో తన పక్కనే నిల్చోబెట్టుకున్నారు. అసలే అలకపూనిన ఆయనను ఊరడించడానికి అన్నట్టుగా, ఆయన చేతిని కూడా స్వయంగా లాగి.. ఆయనతో కలిసి లాప్ టాప్ లో బటన్ నొక్కారు జగన్.!