దక్షిణాదిలో తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే కాకుండా 2024 లోక్ సభ ఎన్నికలలో తిరిగి ఆధిక్యత పొంది, వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి వచ్చేనెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం బిజెపికి అత్యవసరం.
అయితే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోవడంతో పాటు పార్టీకి చెందిన అనేకమంది మంత్రులు, ఎమ్యెల్యేలు అవినీతిపరులుగా ప్రజలలో ముద్ర పడింది. బలమైన ప్రజాకర్షణ గల నాయకుడిగా పేరొందిన బిఎస్ యడ్యూరప్ప ఎన్నికలలో పోటీచేయకుండా బహుశా బిజెపి మొదటిసారి ఎన్నికలకు వెడుతుంది.
ఆయన స్థానంలో ప్రజాకర్షణ గల నేతలెవ్వరూ లేరు. ఇటువంటప్పుడు తెలుగు వారి ప్రభావం కలిగిన సీట్లలో గెలుపొందడం బిజేపికి చాల అవసరంగా మారింది. సుమారు 40 సీట్లలో తెలుగు వారు గణనీయ సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారని, కనీసం 25 సీట్లలో గెలుపోటములను వారే నిర్ణయిస్తారని చెబుతున్నారు.
గత ఎన్నికలలో తెలుగు వారు ఎక్కువగా కాంగ్రెస్ కే ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో కర్నాటక రాష్ట్రంలో చంద్రబాబు పర్యటించి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ద్వారా గణనీయ సంఖ్యలో తెలుగు వారు బిజెపికి ఓటు వేసేటట్లు చేయగలిగారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
పలువురు టీడీపీ నాయకులు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికారు. ఏది ఏమైతేనేమి తెలుగు వారు ప్రాబల్యం గల నియోజకవర్గాలలో అత్యధికంగా కాంగ్రెస్ గెలుపొందగలిగింది. ఇప్పుడు గాలి జనార్ధనరెడ్డి కూడా పార్టీకి దూరం కావడంతో ఈ నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారింపవలసిన అవసరం ఏర్పడింది.
ఏపీలో జగన్, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్ధులు నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రస్తుతం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటున్నారు. అయితే గాలి జనార్ధనరెడ్డి బిజెపి నుండి విడిపోయి, సొంతంగా పార్టీ పెట్టి, బిజెపి ఓట్లను చీల్చే పనిలో పడటంతో బిజెపికి మద్దతు అందించడం జగన్ ను ఇరకాటంలో పడవేస్తుంది.
ఇక, తెలుగు రాష్ట్రాలలో టిడిపితో పొత్తు విషయమై ఇప్పటివరకు సానుకూలంగా బిజెపి స్పందించకపోవడంతో టిడిపి బహిరంగంగా కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేదు. కేవలం టీడీపీ నేతలను ఆకట్టుకోవడం కోసమే ఈ మధ్యకాలంలో అమరావతి రాజధాని విషయంలో, ఇతరత్రా కొన్ని సానుకూల సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపుతున్నది.
హడావుడిగా పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం సహితం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అన్నది స్పష్టం. ఆయనకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహితం మంచి సంబంధాలున్నాయి. ఏమేరకు బిజెపికి కర్ణాటకలో ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో సహకారం అందించగలరో చూడవలసి ఉంది.