మిస్సింగ్ ఫోన్ లో బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్యెల్యేలంటూ సంజయ్ మరో డ్రామా!

Thursday, December 19, 2024

పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడంపై కాకుండా నిత్యం మీడియాలో హైలైట్ కావడం పైననే ఎక్కువగా దృష్టి సారిస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన `మిస్సింగ్ మొబైల్’ పై సరికొత్త డ్రామాకు తెరలేపారు. టెన్త్ లీకేజిలో ఆ మొబైల్ కీలకం అంటూ, దానిని అప్పచెప్పాలని ఒక వంక పోలీసులు వత్తిడి చేస్తుండగా, ఆ ఫోన్ పోలీసులు తనను అరెస్ట్ చేసిన్నప్పుడు పోయిందని ఆదివారం ఉదయం కరీంనగర్ పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల వద్దనే తన ఫోన్ ఉన్నదంటూ చెబుతూ వచ్చిన సంజయ్ సాయంత్రం అయ్యేసరికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిందంటూ సరికొత్త ఆరోపణ చేశారు. ఎందుకంటె, పలువురు బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్యెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, ఆ సమాచారం బైటకు పొక్కితే ప్రమాదమని కేసీఆర్ ఫోన్ ను తన వద్దనే ఉంచుకున్నారంటూ సరికొత్త ఆరోపణ చేశారు.

తమతో వారు పలుమార్లు సంప్రదింపులు జరిపారని, సీఎం కేసీఆర్‌కు ఈ విషయం తెలిసి మూర్చపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పలుమార్లు మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ నేతలు పేర్కొనడం గమనార్హం. బండి సంజయ్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు.

బిఆర్ఎస్ ఎమ్యెల్యేలకు బేరాలాడుతూ ఆరు నెలల క్రితం బిజెపి అధిష్టానంకు సన్నిహితంగా ఉన్న ముగ్గురు పోలీసులకు అడ్డంగా దొరికి పోవడం తెలిసిందే. అందులో స్వయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కీలక పాత్ర వహించినట్లు ఆధారాలు లభించాయి. అయితే కోర్టులకు వెళ్లి, తెలంగాణ పొలిసు విచారణ ముందుకు సాగకుండా బిజెపి నేతలు అడ్డుకొంటు వస్తున్నారు.

ఇప్పుడు సంజయ్ మాటలు వింటుంటే బిఆర్ఎస్ ఎమ్యెల్యేలకు బిజెపి నేతలు గాలం వేస్తుండటం నిజమే అని స్పష్టం అవుతుంది. పైగా, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సంజయ్ బిజెపి లీగల్ టీం సభ్యులతో చెప్పడం గమనార్హం. చాలామంది ఎమ్మెల్యేలు తనతో ఫోన్‌లో మాట్లాడతారని, అందుకే పోలీసులను పంపించి తన ఫోన్‌ను కేసీఆర్ తీసుకున్నారని బండి ఆరోపించారు.

 కేసీఆర్ కోసం పోలీసులే తన ఫోన్‌ను మాయం చేశారని బండి ఆరోపించారు. తన ఫోన్ బయటకు వస్తే సంచలన విషయాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర లేకపోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు? ఆ ఫోన్ తెస్తే అంతా బయటపడుతుంది అని వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ మీడియాతో చెప్పిన అనంతరమే సంజయ్ తన ఫోన్ పోయినదని వాదన లేవదీయడం గమనార్హం.

తనను అరెస్ట్ చేసిన్నప్పుడు తొక్కిసలాటలో ఫోన్ కింద పడిపోయినదని చెబుతున్న సంజయ్ మరుసటి రోజు సాయంత్రం వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్లిన్నప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న ఫొటోలో మీడియాలో రావడం గమనార్హం.

బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద డ్రామా అని తెలంగాణ రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోపించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ ఇప్పుడు తప్పించుకునేందుకు కొత్తవేషాలు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సంజయ్ అరెస్టు అయిన రోజు రాత్రి ఫోన్ ఆయనతోనే ఉందని.. తాను ఫోన్లో మాట్లాడానని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పారని గుర్తు చేశారు.

అలాగే అరెస్ట్ అయిన తర్వాత రోజు బండి సంజయ్‌తో తన ఫోన్లో మాట్లాడానని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ జైలు నుండి విడుదలైన సమయంలో అసలు ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారని, ఫోన్‌లో ఏముందని అడుగుతున్నారంటూ పోలీసులపైనే ఆయన ఆరోపణలు చేశారన్నారని తెలిపారు. రెండు రోజుల తర్వాత ఫోన్ పోయినదని ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles