ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు తొలిరోజునుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ సర్కారు ఆ నిందలను ఎన్నడూ ఖాతరు చేసింది లేదు. ఇప్పటికీ ప్రతి పార్టీ కార్యక్రమానికీ వాలంటీర్లనే వాడుకుంటున్నారు. జగనన్నకు ఓటు వేయాల్సిందిగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత వాలంటీర్లతే అని ఎమ్మెల్యేలు, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వారితో సమావేశాల్లో వాక్రుచ్చుతున్నారు. అదే సమయంలో, జగనన్న ప్రభుత్వం మళ్లీ రాకపోతే గనక వాలంటీర్ల వ్యవస్థ పోతుందని, వారి ఉద్యోగాలు పోతాయని వారిని బెదిరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏడాదికోసారి పార్టీకోసం ముమ్మరంగా పనిచేస్తున్న వాలంటీర్లకు సత్కారం రూపంలో సర్కారీ సొమ్మును ముడుపులుగా సమర్పించే కార్యక్రమం కూడా ఇంకోటి ఉంది.
ప్రతి ఉగాదినుంచి వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం పేరిట ప్రభుత్వం ఎంపికచేసిన వాలంటీర్లకు భారీ మొత్తాలు నగదు పురస్కారాలను ప్రభుత్వం అందిస్తుంటుంది. ‘వలంటీర్లకు వందనం’ పేరుతో సాగించే ఈ ప్రహసనాన్ని ఈ ఏడాది కూడా ఈనెల 14నుంచి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నియోజకవర్గానికి అయిదుగురు వంతున.. రాష్ట్రంలో ది బెస్ అనుకున్న 875 మందికి సేవా వజ్ర బిరుదుతో 30వేల డబ్బు, రాష్ట్రంలో 4220 మందికి సేవారత్న పేరుతో 20వేల వంతున డబ్బు, 2,28,624 మందికి సేవామిత్ర బిరుదుతో రూ.పదివేల వంతున డబ్బు అందజేస్తారు.
బాగా పనిచేసే వాలంటీర్లు అనే కోటాలో ఎంపిక చేయడం అంటే.. అచ్చంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా, కార్యకర్తలుగా సేవలందిస్తున్న వారిని ఎంపిక చేయడం మాత్రమే అనే నిర్వచనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వాలంటీర్లు అంటేనే వైసీపీ అనుయాయులుగా ఆల్రెడీ ముద్ర పడ్డారు. అందులోనూ.. తమ మాట వినేవారిని, చెప్పుచేతల్లో ఉండేవారిని, ఆదేశాలను శిరసావహించేవారిని ఈ ‘వలంటీర్లకు వందనం’ కింద సత్కరిస్తారన్నమాట. వారికి సర్కారీ సొమ్మును ముడుపుకట్టి దోచిపెడతారన్నమాట.
అయినా.. వాలంటీర్లకు సత్కారం పేరిట సర్కారు సొమ్మును దోచిపెట్టడం ఈ ప్రభుత్వానికి ఇది చివరి విడతే అవుతుంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఉగాదినాడు ప్రకటించాలని అనుకుంటే.. అప్పటికే ఇంచుమించుగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ఉంటుంది. వాలంటీర్లకు ఇలాంటి నగదు పురస్కారాలిచ్చి, వారిని దువ్వి, తమకు మరింత బానిసలుగా మార్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తున్నట్టుంది.
వాలంటీర్లకు సర్కారు సొమ్ముతో చివరి లంచం!
Monday, December 23, 2024