సాధారణంగా రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉంటె సినీ నటుడు, టీడీపీ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ బహుశా తొలిసారిగా ఏపీ రాజకీయాలలో కలకలం రేపి సంచలన వాఖ్యలు చేశారు. వైసీపీలో బబుల్ త్వరలో బద్దలవుతుందని అంటూ వైస్సార్సీపీ కి చెందిన పలువురు నేతలు మాతో టచ్ లో ఉన్నారంటూ రాజకీయ బాంబు పేల్చారు.
అల్లుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగలం పాదయాత్రం 800 కిమీ మార్క్ చేరుకుంటున్న సందర్భంగా శుక్రవారం శింగనమల నియోజకవర్గంలో చేరి, సంఘీభావం తెలిపారు. యాత్ర మొదటిరోజున కుప్పంలో ఉన్న ఆయన నందమూరి తారకరత్న కుప్పకూలిపోవడంతో అతనితో పాటు బెంగళూరు ఆసుపత్రికి వెళ్లిన బాలకృష్ణ ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి భారీ కాన్వాయ్‌తో గార్లదిన్నె మండలం మర్తాడు శివారు క్యాంప్ సైట్‌కు చేరుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని..రాష్ట్రంలో డ్రగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఆఖరికి తిరుమలని కూడా వైసీపీ గంజాయి మాఫియా వదలడం లేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తిరుమలలో కూడా గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
సీఎంకి మెగా బైట్‌కు, గిగా బైట్‌కు తేడా తెలియదని సెటైర్లు పేల్చారు. జగన్‌కు పాలన చేతకాదని పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వెల్లడించారు. సలహాదారుల మాట కూడా జగన్ వినడని, ముఖ్యమంత్రిలో అదో తరహా సైకో ప్రవర్తన అంటూ బహుశా మొదటిసారిగా జగన్ తీరుతెన్నులపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి చెంపపెట్టని చెబుతూ వైసీపీ నేతలలో కూడా అసంతృప్తి ఉందని, ఆ పార్టీలో త్వరలో బుడగ బద్దలవుతుందని చెప్పారు. ప్రజాసేవ చేయాలని కొంతమంది వైసీపీ నేతలకు ఉన్నప్పటికీ ఆయన చేయనివ్వరని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సేవ చేయడానికి టీడీపీలోకి వస్తే మంచిదే అంటూ వారికి బాలకృష్ణ స్వాగతం పలికారు.
తనను మించిన సైక్రియాటిస్ట్ లేరని, సైకాలజీ చదవకపోయిన మనుషుల సైకాలజీ తనకు బాగా తెలుసని అంటూ జనం అటే జగన్‌కు కక్ష.. అదో రకం సైకో తత్వం అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని బాలయ్య విమర్శించారు. మద్యం, డ్రగ్స్ ను యువతలోకి పంపి వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కు మనుషులంటే అలర్జీ అని అన్నారు.
ఓటే మీకు ఆయుధం. అదే మీకు రక్షణ అని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది? బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ? వంటివి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ఊసే ఎత్తలేదని జగన్ పాలనపై విమర్శలు కురిపించారు.
రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్ము? సరే చేశారు. దానితో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంతా శూన్యం. పెన్షన్లు పెండింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైఎస్సార్‌సీపీ కుట్ర అని ఆరోపించారు.
కులాల ఉచ్చులో పడొద్దని.. టీడీపీని గెలిపించుకుందాం, లేకుంటే ఓటే వేటు అవుతుందని హెచ్చరించారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతూ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అన్ని వర్గాలు లోకేష్‌కు మద్దతుగా తరలి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కళ్లు తెరవాలని.. భవిష్యత్ కోసం ఓటునే ఆయుధంగా చేసుకోవాలని స్పష్టం చేశారు.