కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరులుగా ముద్ర ఉన్న నాయకులను వెతికిపట్టుకోవడం కష్టం. ఏ స్థాయి నాయకుల మీదనైనా ఏదో ఒక అవినీతి ఆరోపణ తప్పకుండా ఉంటుంది. అలాంటి పార్టీలో.. కేరళకు చెందిన మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి ఏకె ఆంటోనీ రూటే సెపరేటు. కాంగ్రెసు పార్టీ అని మాత్రమే కాదు, వర్తమాన రాజకీయాల్లోనే నిజాయితీకి ఆయన ఒక బ్రాండ్ అని ఎరిగిన వారు చెబుతుంటారు. కాంగ్రెసు పార్టీలో మితవాద, కుయుక్తులు ఎరగని రాజకీయం చేసే నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. కేంద్రంలో కాంగ్రెస్ పాలన సాగే రోజుల్లో.. నిష్కళంకతను చూపించుకోవాల్సిన చాలా సందర్భాల్లో కాంగ్రెసు పార్టీ ఏకె ఆంటోనీ సేవలను వాడుకునేది. అలాంటి ఏకే ఆంటోనీ రాజకీయ వారసుడు ఇప్పుడు కమలదళంలోకి వెళ్లిపోయారు.
ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కేరళ కాంగ్రెస్ పార్టీలో గతంలో సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తుండేవారు. ప్రధాని నరేంద్రమోడీ మీద బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన నేపథ్యంలో ఆయనకు సొంత పార్టీతో విభేదాలు తలెత్తాయి. కేంద్రం సదరు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనిల్ ఆంటోనీ మాత్రం.. మోడీని సమర్థించారు. బీబీసీ ఈ డాక్యుమెంటరీ విషయంలో దురుద్దేశాలతో కుట్రపూరితంగా వ్యవహరించిందని, మన దేశసమగ్రతను ఇది దెబ్బతీసేలా ఉన్నదని ఆయన ట్వీట్ చేశారు.
తమ పార్టీ కీలక నాయకుడు అనిల్ ఆంటోనీ ఇలా మోడీని సమర్థించే ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ గుస్సా అయింది. ఆ ట్వీట్ ను తొలగించాల్సిందిగా అనిల్ ను ఆదేశించింది. అయితే ఈ విషయంలో పార్టీ వైఖరితో విభేదించిన ఆయన ఈ ఏడాది జనవరిలో ఏకంగా రాజీనామా చేసేశారు. అప్పటినుంచి రాజకీయంగా స్తబ్ధుగానే ఉన్నారు.
తాజాగా అనిల్ ఆంటోనీ బిజెపిలో చేరడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆంటోనీకి సచ్ఛీలుడిగా ఉన్న మంచిపేరు కొడుకుకు ప్లస్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ కు ఇమేజ్ పరంగా నష్టం కూడా. పైగా కేరళలో బిజెపి మరింత గట్టిగా కాళ్లూనుకోవడానికి ఏకే ఆంటోనీ వారసత్వం వారికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ లో నాయకులు ఒక కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తుంటారంటూ.. అనిల్ అంటోనీ కమలదళంలో చేరిక సందర్భంగా విమర్శలు చేయడం కూడా గమనార్హం.
కాంగ్రెస్ నిజాయితీ బ్రాండ్.. కమలదళంలోకి!
Wednesday, December 18, 2024