పేపర్ లీకేజిలో బండి సంజయ్ ఏ 1, కుట్రదారుడు!

Thursday, December 19, 2024

తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 10వ తరగతి పరీక్షాపత్రాల లీకేజి విషయంలో బుధవారం అర్ధరాత్రి నాటకీయరీతిలో పోలీసులు అరెస్ట్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను ఎఫ్ఐఆర్ లలో కుట్రదారునిగా, పైగా నిందితులలో ఏ1 గా  పేర్కొన్నారు.  పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.

టీఎస్‌పీఎస్సీ, పదవ ప్రశ్నపత్రాల లీకేజీలతో తీవ్రమైన విమర్శలు, ఆగ్రవేశాలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ప్రజల దృష్టి బండి సంజయ్ అరెస్ట్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకో తెలిసో, తెలియకనో బిజెపి కూడా సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నది. సంజయ్ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు చేరుకున్నప్పటి నుండి ఎక్కడికక్కడ సంజయ్ అరెస్ట్ గురించిన ప్రశ్నలనే బీజేపీకి శ్రేణులు లేవనెత్తుతా అసలు సమస్యలను మరచిపోయిన్నట్లు వ్యవహరిస్తే ఉండటం గమనార్హం.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరో అడుగు ముందుకు వేస్తూ కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే  బండి సంజయ్  కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనని ఆమె ధ్వజమెత్తారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ నిందితుడు రాజశేఖర్, టెన్త్ పేపర్ లీకేజ్ లో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ కు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయని అంటూ మంత్రి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 కింద కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఐదారు గంటలపాటు సంజయ్ ను వాహనాలలో తిప్పుతూ, ఎక్కడకు తీసుకు వెడుతున్నామో కూడా చెప్పకుండా దాటవేస్తూ వచ్చిన పోలీసులు చివరకు పాల‌కుర్తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం వ‌రంగ‌ల్ పీటీసీకి త‌ర‌లించి, అక్క‌డ్నుంచి  హ‌నుమ‌కొండ ప్రిన్సిప‌ల్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు ఎదుట‌  హాజ‌రుప‌రిచారు. 

వికారాబాద్, కమలపూర్‌ లలో 10వ తరగతి  పేపర్ లీకేజ్‌ లపై బండి సంజయ్ పత్రిక ప్రకటనలు విడుదల చేశారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే భాద్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌ లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు తెలిపారు.

బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామని తెలిపారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్ లీకేజీలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.  తాండూరు, వరంగల్ లో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాత్ర ఉందని  ఆమె వెల్లడించారు. బండి సంజయ్ తో సంబంధాలున్న వ్యక్తులే పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

పైగా, వికారాబాద్ లో టెన్త్ పేపర్ లీక్ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులని మంత్రి విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఆమె  సబితా ఇంద్రారెడ్డిహెచ్చరించారు. 
మరోవంక,  బండి సంజయ్, ఇందులో కీలక నిందితుడు ప్రశాంత్ల చాంటింగ్లపై పోలీసులు దృష్టి సారించారు.

పేపర్‌ లీక్‌ కంటే ముందురోజు ప్రశాంత్‌తో సంజయ్‌ చాటింగ్‌ చేశారని, సంజయ్‌తో ప్రశాంత్‌ 100కు పైగా కాల్స్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం సంజయ్‌కు పేపర్‌ పంపాక కూడా ప్రశాంత్‌ కాల్‌ మాట్లాడినట్లు గుర్తించారు. ప్రశాంత్‌ వాట్సాప్‌ చాట్‌ను అధికారులు రిట్రివ్‌ చేస్తున్నారు.

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా ఆరోపిస్తున్న బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

పదో తరగతి పేపర్‌ లీకేజీకి పాల్పడి బండి సంజయ్‌, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. పేపర్‌ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త, బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడని ఆయన ఆరోపించారు. పేపర్‌ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్‌ మీ పార్టీ కార్యకర్త కాకపోతే అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్‌ చేశారని బీజేపీని ఆయన ప్రశ్నించారు.

‘ బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదు. బీజేపీలో చదువుకున్నోళ్లు తక్కువ ఉన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అంతా ఫేక్‌ సర్టిఫికెట్లే వీళ్లవి. ఈ పేపర్‌ లీకేజీ వెనుక సూత్రధారి, పాత్రధారి అంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా బండి సంజయ్‌ ఉన్నాడు. బండి సంజయే కుట్ర చేసిండు’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles