వైసీపీలో ఎమ్యెల్యేలు, మంత్రులు అందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తిరిగి తమకు సీట్ ఇస్తారా లేదా అని ఆందోళలన చెందుతుంటే, మంత్రి అంబటి రాంబాబు మాత్రం అసలు పోటీ చేసేందుకు తనకు ఎక్కడైనా సీట్ దొరుకుతుందా లేదా అని మధన పడుతున్నారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి సీట్ తిరిగి ఇచ్చినా గెలుపొందడం కష్టం అని ఆయనకే తెలుసు. సొంత పార్టీ వారే తిరగబడుతున్నారు.
దానితో పోటీ చేద్దామంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఆయనకు సురక్షితంగా ఉండే సీట్ కనిపించడం లేదు. పొరుగుజిల్లా – ఉమ్మడి కృష్ణాలోని అవనిగడ్డ మీద కన్ను పడింది. కానీ, అక్కడి స్థానికులే చాలామంది ఆ సీట్ కోసం పోటీపడుతున్నారు.
పైగా, అక్కడ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టిడిపి అభ్యర్థిగా బలమైన స్థానంలో ఉన్నారు. ఇక్కడి నుండి రాంబాబును అక్కడికి పంపేందుకు సీఎం జగన్ సిద్దపడే అవకాశాలు కూడా కనబడటం లేదు. నిత్యం మీడియాలో తన మంత్రివర్గంకు సంబంధించిన అంశాలపై కన్నా రాజకీయ ప్రత్యర్థులను దుర్భాషలాడుతూ కనిపిస్తుంది మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో తిరిగి ఆయనకే సీట్ ఇస్తే వైసిపి శ్రేణులే పట్టుబట్టి ఓడిస్తామంటూ బహిరంగంగా స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి సత్తెనపల్లిలో టిడిపిలో సహితం కుమ్ములాటలు ఉన్నాయి. అయినా, అంబటి రాంబాబు విషయంలో టిడిపిలో వర్గాలు, వైసిపిలో అసమ్మతి వర్గాలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సత్తెనపల్లిలో వైసీపీ ఉనికి కోల్పోయిన పరిస్థితి ఉందని, వైసీపీ నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతూ అంబటిని కలసే పరిస్థితి నాయకులకు లేదంటూ మాజీ గ్రంథాలయ చైర్మన్ చిట్టా విజయ భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాను ఆ సీటు నుండి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బహిరంగంగా ఆయన ప్రకటించారు.
సత్తెనపల్లి ఆనాధ నియోజకవర్గం కాదని, స్థానిక న్యాయకత్వం సత్తెనపల్లికి అవసరమని అంటూ రేపల్లి నుండి వలస వచ్చిన అంబటి ఇక్కడ నూకలు చెల్లిన్నట్లే అన్న సంకేతం ఆయన పార్టీ అధిష్టానంకు ఇచ్చారు. గతంలో అంబటికి సీటు వద్దంటూ రెడ్డి సామాజిక వర్గం అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేసింది.
అంబటి తనకు కేటాయించిన శాఖపైనా పట్టు సాధించలేదని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో విఫలం అయ్యారని ప్రచారం ఉంది. దీనికి తోడు ఇటీవల బైటకు వచ్చిన ఆయన ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో కాల్స్ వ్యవహారం పార్టీ నాయకత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టివేస్తున్నది.
ఈ కారణాలను ప్రధానంగా హైలైట్ చేస్తూ అంబటికి మళ్లీ టికెట్ లేకుండా చేయాలని ప్రత్యర్థి గ్రూపు ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో 4,000 మందితో కార్యకర్తలతో వైయస్సార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
1989లో స్వస్థలం రేపల్లి నుండి గెలుపొందిన రాంబాబు తిరిగి అక్కడ గెలుపొందలేదు. ఆ తర్వాత 2014లో సత్తెనపల్లి నుండి పోటీ చేసి ఓటమి చెందినా, 2019లో గెలుపొందారు. “మా రేపల్లిలో నా సంగతి అందరికి తెలిసింది కాబట్టి ఎవ్వరు ఓటు వేయరని, నా గురించి తెలియని సత్తెనపల్లికి వచ్చాను” అంటూ ఆ సందర్భంగా మిత్రులతో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు సత్తెనపల్లిలో కూడా తన గురించి తెలియడంతో మరెక్కడికి వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. పోనీ ఎమ్యెల్యే సీట్ వద్దు ఎమ్యెల్సీ సీట్ ఇవ్వమని పార్టీ అధినేతను అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు.