వైసిపి దాడులతో  హీరోలుగా ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్!

Monday, December 23, 2024

అమరావతి ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు మద్దతు తెలిపి తిరిగి వస్తున్న సమయంలో బీజేపీ నేత సత్యకుమార్‌ పై  మూడు రాజధానుల శిబిరం వద్ద వైసీపీ శ్రేణులు దాడికి దిగడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. పైగా, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లక్ష్యంగా దాడి చేశారని, ఆయన ముందుగానే వెళ్లిపోవడంతో సత్యకుమార్ చిక్కారని చెబుతున్నారు.

మాజీ మంత్రి చిక్కి ఉంటె బాబాయిని నరికినట్లు నరికి చంపేసి ఉండేవారంటూ సత్యకుమార్ తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు. వాస్తవాలు ఏమైనా ఈ ఘటనతో వారిద్దరూ హీరోలుగా మారారు. సత్య కుమార్ ఎవ్వరో ఆయన సొంతఊరు ప్రొద్దుటూరులో కూడా తెలియదు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద సుదీర్ఘకాలం  పీఎంగా పనిచేసి ఉండడంతో విశేషమైన ప్రాబల్యం సంపాదించుకొని, పార్టీలో ఒకేసారి జాతీయ కార్యదర్శి పదవి పొంది, ఏపీ రాజకీయాలలో మీడియా ద్వారా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆదినారాయణ రెడ్డి బీజేపీలో కొన్ని కారణాలతో చేరినా ఆయన మనసు అంతా టిడిపి పైనే ఉంది. బిజెపి – టిడిపి పొత్తు లేని పక్షంలో టిడిపిలో చేరేందుకు కూడా సిద్ధం. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో ఉత్సాహం పాల్గొనడం లేదు. అయితే వీరిద్దరూ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవ్వరికీ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అమరావతి ప్రాంతం వచ్చారు.

అయితే సత్యకుమార్ కు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా వైసిపి దాడి చేసింది అనడంతో మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరపమని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. దానితో శనివారం జిల్లా కేంద్రాలలో సత్యకుమార్ కు మద్దతుగా బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగాక తప్పలేదు. ఈ విధంగా ఓ రాజకీయ నాయకుడిగా సత్యకుమార్ ఉనికి చాటుకో గలిగారు.

మరోవంక, ఆదినారాయణరెడ్డి రెండేళ్లుగా తన వ్యక్తిగత భద్రత కోసం గన్ మెన్ లను ఏర్పాటు చేయమని రాష్ట్ర పోలీసులను, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నారు. కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటంలేదు.

ఇప్పుడు ఆయన లక్ష్యంగా దాడి జరిగినట్లు స్పష్టం కావడం, దొరికి ఉంటె చంపేసి ఉండేవారని సత్యకుమార్ పేర్కొనడంతో వ్యక్తిగత భద్రత కల్పించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ రాష్ట్ర పోలీసులు అందుకు ముందుకు రాకపోతే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అయినా కల్పించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో అనేకమంది బిజెపి నేతలకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తున్నది.

మరోవంక ఆదినారాయణ రెడ్డిపై దాడి యత్నం గురితప్పి సత్యకుమార్ పై జరగడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం ఖంగుతిన్నట్లు తెలుస్తున్నది. ఆదినారాయణ రెడ్డిపై దాడి జరిగినా బిజెపి కేంద్ర నాయకత్వం పెద్దగా పట్టించుకొనెడిది కాదని, ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలలో ఉండడంతో సాధారణమే అని భావించేవారని అనుకొంటున్నారు.

అయితే సత్య కుమార్ కు ఢిల్లీలో పలుకుబడి ఉండటం, ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వద్ద సాన్నిహిత్యం ఉండడంతో ఈ దాడిని కేంద్రం తీవ్రంగా తీసుకొనే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

మరోవంక, ఈ దాడికి మూలకారకుడిగా భావిస్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పటికీ ఎప్పుడూ స్థానిక విషయాలలో, ముఖ్యంగా అమరావతి రైతుల ఉద్యమంలో జోక్యం చేసుకోలేదని చెబుతున్నారు.

స్థానికంగా తన ఇసుక దందాకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం స్థానిక ప్రజలతో సామరస్యంగా ఉంటూ వస్తున్నారని, మొదటిసారిగా కడప రాజకీయాల కారణంగా ఆదినారాయణరెడ్డిపై దాడికి ప్రయత్నం చేయవలసి వచ్చిందని  భావిస్తున్నారు. వారి గురి తప్పడం ఇప్పుడు బిజెపి నాయకులకు కలసి వస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles