పుట్టపర్తిలో వైసీపీ, టీడీపీ వర్గాలు రాళ్లు, చెప్పులతో దాడులు!

Monday, December 23, 2024

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత ఎవ్వరికీ వారుగా ఆధిపత్యం కోసం వీధులలో బలప్రదర్శనకు దిగడం ప్రారంభమైంది. ఇరు పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి.

తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసిరుకున్నారు. శనివారం సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు పిలుపునిచ్చారు.

దీంతో ఇరు పార్టీల కేడర్ గా భారీగా ఆలయం వద్దకు చేరే పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నేతలు రాకుండా అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోలీసులను ఛేదించుకొని ఆలయ ఆవరణకు చేరుకున్నారు.

మరోవైపు పల్లె రఘునాధరెడ్డిని టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా నిర్బంధించిన్నా వెనుకవైపు నుండి గోడదూకి అక్కడకు చేరుకున్నారు. మరోవైపు టీడీపీ ఆఫీస్ వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న పల్లె రఘనాథ్ రెడ్ ఆలయం వద్ద చేరుకున్నారు. కారుపైకి ఎక్కి సవాల్ విసిరారు.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. ఈ తోపులాటలో రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

మొత్తంగా ఇరు పార్టీలు రచ్చకు ఎక్కడంతో పుట్టపర్తి రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. పుట్టపర్తిలో పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని చెబుతూ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని అందరిని చెదరగొట్టారు.

కాగా, పుట్టపర్తిలో పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనంపై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవని స్పష్టం చేశారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

“సవాలు చేయగానే సరిపోదు శ్రీధర్ రెడ్డి. మాటమీద నిలబడే ధైర్యం ఉండాలి!! నీ అవినీతి బయటపడి, నీ బాగోతం అంతా ప్రజలకి ఎక్కడ తెలిసిపోతుంది అనే భయంతోనే ఈ విధంగా పోలీసులను పంపి మమ్మల్ని అడ్డుకున్నావ్” అంటూ రఘునాథరెడ్డి విమర్శించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles