కెసిఆర్ నిర్ణయం భారాసకు గొడ్డలి పెట్టు!

Tuesday, December 24, 2024

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. మరో నలభై రోజుల వ్యవధిలో అక్కడ పోలింగ్ జరగనుంది. జాతీయ పార్టీగా రూపు దాల్చిన తర్వాత తొలి అడుగు కన్నడ సీమలోనే వేస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు వ్యూహం మార్చారు. కన్నడ ఎన్నికల్లో గులాబీ దళం పోటీ చేయడం లేదని, తమకు స్నేహబంధం ఉన్న జీడీఎస్ కు అనుకూలంగా గులాబీ నాయకులు ప్రచారం మాత్రమే నిర్వహిస్తారని తెలుస్తోంది. ‘తాము ప్రభావం చూపగల పొరుగు రాష్ట్రంలో వచ్చిన ఎన్నికలను సద్వినియోగం చేసుకోకపోతే- అలాంటి నిర్ణయం భారత రాష్ట్ర సమితికి ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది కదా’ అనే అభిప్రాయం పార్టీలోని పలువురిలో వ్యక్తం అవుతోంది. ప్రచారం మాత్రం చేయడం అనేది ఒక రకంగా కేసీఆర్ వ్యూహం కూడా అని కొందరు  వ్యాఖ్యానిస్తున్నారు. 

తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దు ప్రాంతాన్ని కర్ణాటక కలిగి ఉంటుంది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి. కెసిఆర్ సారధ్యంలో భారాస స్వయంగా బరిలోకి దిగితే ఎంతో కొంత సత్ఫలితాలు ఉంటాయని వారి నమ్మకం. జెడిఎస్‌తో స్నేహం కారణంగా కనీసం కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకుని అయినా సరే పోటీ చేస్తే, కన్నడ నాట గులాబీ అడుగులు పడతాయని వారు ఆశిస్తున్నారు. కానీ కెసిఆర్ కేవలం ప్రచారానికి మాత్రం పరిమితం కావాలనుకోవడం చిత్రంగా ఉంది.

అదే సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ యొక్క రాజకీయ చాణక్య తెలివితేటలకు నిదర్శనం అని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మధ్య సమరం గా కన్నడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ దిగ్గజాల పోరులో వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా గులాబీ పార్టీ ప్రవేశించి సాధించేది పెద్దగా ఏమీ ఉండదు. అందుకే కేవలం జెడిఎస్ కు ప్రచారానికి మాత్రం పరిమితం అయితే ఫలితాల తర్వాత సరికొత్త వ్యూహరచన చేయగలం అని ఆలోచిస్తున్నారు. ఎన్నికల ఫలితాలలో జెడిఎస్ తమ బలాన్ని నిరూపించుకున్నట్లయితే, వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలలో జెడిఎస్ మద్దతు తీసుకుని గులాబీ అభ్యర్థులను ఎంపీలుగా మోహరించవచ్చు అనేది కేసీఆర్ వ్యూహం అని అంటున్నారు. ఆయన వ్యూహం కేంద్రంలో ప్రధాని మోడీని దెబ్బ కొట్టడం మాత్రమే గనుక కన్నడ అసెంబ్లీ ఎన్నికల మీద అంతగా శ్రద్ధ పెట్టడం  లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

వ్యూహాల పరంగా చూసినప్పుడు ఇలాంటి ఎత్తుగడలు బాగానే కనిపిస్తాయి. కానీ కెసిఆర్ ఆలోచన భారత రాష్ట్ర సమితికి మేలు చేస్తుందో? చేటు చేస్తుందో? మరి కొంత కాలం గడిస్తే తప్ప అర్థం కాదని ప్రజలు అనుకుంటున్నారు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles