తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే బిజెపి నేత సత్యకుమార్ పై దాడి?

Thursday, September 19, 2024

అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో శుక్రవారం జరిగిన సభలో పాల్గొని, సంఘీభావం తెలిపి తిరిగి వస్తుందా  ఉద్దండరాయునిపాలెం వద్ద బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులపై జరిగిన దాడి రాజకీయ కలకలం రేపుతోంది. ఈ దాడి తాడేపల్లి ప్యాలెస్ నుంచి‌వచ్చిన ఆదేశాల మేరకే జరిగినదని సత్యకుమార్ ఆరోపించారు.

దాడి చేసిన వారికి మద్దతు ఇస్తూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ “ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నాడా?” అని ప్రశ్నించడం చూస్తుంటే పధకం ప్రకారం జరిగిన దాడిగా స్పష్టం అవుతుందని తెలిపారు. మూడు రాజధానులు అనుకూలంగా ధర్నా చేస్తున్న వారు తమను చూడగానే తమ వాహనాలకు అడ్డుపడి, దాడికి పాల్పడ్డారని చెబుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, దాడి చేసినవారిని కాకుండా తమనే వెనుకకు నెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘తాడేపల్లి ప్యాలెస్ నుంచే పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీని పై కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఉంది. నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. నేను డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించడం లేదు. అంత మంది పోలీసులు ఎందుకున్నారు..?’ అని సత్యకుమార్ నిలదీశారు. పైగా, దాడికి గురైన ఇద్దరూ సీఎం జగన్ సొంతజిల్లా కడపకు చెందినవారే కావడం గమనార్హం.

గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు వద్ద పీఎంగా ఉంటూ, కీలక భూమిక వహించిన సత్యకుమార్ ప్రస్తుతం ఏపీ బీజేపీలో టిడిపితో పొత్తు పెట్టుకోవాలనుకొనే వర్గానికి నేతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీతో అంటకాగుతున్న రాష్త్ర బిజెపి నేతలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సత్యకుమార్ పై దాడి జరపడం ఒక విధంగా టిడిపితో స్నేహంగా ఉండాలనుకునే రాష్ట్ర బీజేపీలోని నేతలకు ఒక హెచ్చరికగా పలువురు భావిస్తున్నారు.

“ఎంపీ నందిగం సురేష్‌పై చర్యలు తీసుకోవాలి. అతని కాల్ డేటా బయటకు తీయాలి. తాడేపల్లి నుంచి అతనికి ఆదేశాలు రాకపోతే.. ఎందుకు సురేష్ తన అనుచరులను పంపారు’ అని ఆదినారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
దాడి వెనుక ఉన్న సూత్రధారులపై డిజిపి చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. మందడంలో వేలాది మంది రైతులు దీక్ష చేస్తుంటే 10 మంది కూడా పోలీసులు లేరని, మూడు రాజధానులకు మద్దతుగా 10 మంది దీక్ష చేస్తుంటే వంద మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. ఓ పథకం ప్రకారమే ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారని సత్య కుమార్ ఆరోపించారు.

“జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో… మీరే కాదు, మేము కడప జిల్లా నుంచే వచ్చాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఎందుకు..? తేల్చుకునే పరిస్థితి వస్తే ధైర్యం గా దమ్ముగా రండి” అంటూ సత్య కుమార్ హెచ్చరించారు. ఈ దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండిస్తూ వైసిపి తగు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.

బిజెపి నేత సత్య కుమార్ వాహనంపై వారిపై కార్యకర్తలు దాడి చేయడాన్ని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైసిపి మూకలు దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. దాడి చేసే వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా ఉంచాలని రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేత సత్యకుమార్‌ పై దాడిని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరితీవ్రంగా ఖండించారు. ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలపై వైసీపీ దాడులు ఛేస్యుస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏపీలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో సత్యకుమార్‌ పై దాడి నిదర్శనం అని ఆమె మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles