కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పదవులు లేకపోయినా పార్టీ మీద వారసత్వపు పెత్తనాన్ని అప్రతిహతంగా కొనసాగించగల మహా నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ పదవికి వచ్చిన నష్టం ఎంత మాత్రం లేదు. తమ కుటుంబాన్ని కొన్ని దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకుంటూ వచ్చిన అమేధీ నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయి.. ఆపద్ధర్మంగా దక్షిణాది రుచికోసం ఎంచుకున్న వయనాడు నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ కి ఊడిపోయిన పదవి మరికొన్ని రోజుల్లోనే తిరిగి ఆయనకు దక్కబోతోంది. మోడీ ఇంటిపేరు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు పర్యవసానంగా అదే రోజు నుంచి ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఎంపీగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ పార్లమెంటు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే హైకోర్టుకు అప్పీలు చేసుకోవడం ద్వారా సూరత్ కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకో గలిగితే ఈ అనర్హత వేటు కూడా చెల్లుబాటులో లేకుండా పోతుంది. వేటు పడిన 10 రోజుల తర్వాత రాహుల్ ఇప్పుడు పైకోర్టులో అప్పీలు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ప్రజా ప్రతినిధుల మీద ఏదైనా క్రిమినల్ దావాలో రెండేళ్లు, అంతకుమించి జైలు శిక్ష పడితే వారి పదవి ఆటోమేటిగ్గా రద్దవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రకమైన చట్ట సవరణ ద్వారా ఇప్పటికే ఎంతోమంది నాయకులు తమ తమ పదవులు కోల్పోయారు. అలా అనర్హత వేటు పడిన వాళ్ళలో రాహుల్ మొదటి వ్యక్తి ఎంత మాత్రమూ కాదు. అందరి విషయంలో కూడా కోర్టు తీర్పు వచ్చిన రోజు నుంచే వారి మీద అనర్హత కూడా అమలులోకి వచ్చింది.
అదే సమయంలో ఈ చట్ట నిబంధనకు మరో వెసులుబాటు కూడా ఉంది. శిక్ష పడిన తీర్పు మీద పై కోర్టులో అప్పిలు చేసుకుని స్టే తెచ్చుకుంటే, అనర్హత వేటు రద్దు అవుతుంది. పైకోర్టు విచారించి కింది కోర్టు తీర్పును కొట్టేస్తే అసలు దిగులే లేదు. అంటే ఈ తరహాలో శిక్షలు పడిన సందర్భాలలో ఆయా ప్రజాప్రతినిధులు పైకోర్టులో అప్పీలు చేసుకోవడం అనేది కీలకమైన సంగతి అన్నమాట. లక్షద్వీప్ కు చెందిన ఒక ఎన్సీపీ ఎంపీ మీదపడిన అనర్హత వేటు, పైకోర్టు ఇచ్చిన స్టేకారణంగా ఇటీవల రద్దయిపోయింది.
అయితే రాహుల్ మటుకు ముందుగా పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం కంటే, తన మీద పడిన అనర్హత వేటు గురించి ప్రజల ఎదుటకు వెళ్లి గోల చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సాకు చూపి తనను మోడీ ప్రభుత్వం వేధిస్తున్నట్లుగా రంగు పులిమి, ప్రతిపక్షాలు అందరి మద్దతు కాంగ్రెసుకు అనుకూలంగా కూడగట్టడానికి కూడా ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు మొత్తం పూర్తయిన తర్వాత.. ఇప్పుడు తీరికగా పై కోర్టులో ఆపీలు చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది.
అప్పీలు చేయడం అంటూ జరిగితే, కచ్చితంగా స్టే వస్తుంది. రాహుల్ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆయన తన ఎంపీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఇంటితో అనేక జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి అంటూ పండించిన ఎమోషనల్ డ్రామా కూడా ముగుస్తుంది. రాహుల్ కు తమ నివాసం ఇవ్వడానికి వేలమంది సిద్ధంగా ఉన్నారంటూ, ఆయన చుట్టూ అల్లిన సానుభూతి డ్రామా కూడా ఆగుతుంది. పైకోర్టు తీర్పు ఇచ్చేవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వారు కూడా శిక్షను ధృవీకరిస్తే గనుక.. అప్పుడిక అధికారిక నివాసం ఖాళీ చేయక తప్పదు. ఆయన అభిమానులు ఎవరూ తమ తమ నివాసాలను ఆయన కోసం త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడదు. ఎందుకంటే ఆ తర్వాతి రెండేళ్ల పాటు ఆయన ఉండవలసినది జైలులో కాబట్టి.