ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ఢిల్లీ వెళ్లి, ముందుగా ప్రకటించినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవకుండా, కేవలం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ జరిపి తిరిగి రావడం రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలకు దారితీస్తుంది. అమిత్ షాను కలసి పోలవరంకు నిధులు అడిగానని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఎందుకంటె, మరుసటి రోజు లాంఛనంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసినప్పుడు ఆ విషయమై అడిగి ఉంటారు. అయితే ఈ విషయంలో కేంద్రం నుండి ఎటువంటి భరోసా లభించినట్లు చెప్పనే లేదు. ఎన్నికల కమీషన్ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజుననే జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం రాజకీయాల కోసమే అని స్పష్టం అవుతుంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడం, తమ్ముడు- కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పకపోవచ్చనిపించడంతో జగన్ ఆందోళనకరంగా ఉన్నారు. ఈ విషయమై ఢిల్లీకి తరచుగా వెళుతున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ విమర్శలను అధికార పక్షం ఎప్పుడూ ఖండించక పోవడం గమనార్హం.
కర్ణాటక ఎన్నికలలో ఏవిధంగా అయినా గెలుపొందాలని పట్టుదలగా ఉన్న బిజెపి ఈ విషయం పైననే ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తున్నది. పైగా, రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది. బెంగుళూరు నగరంతో పాటు, ఏపీకి సరిహద్దు జిల్లాల్లో తెలుగు వారు గణనీయంగా ఉండడంతో వారిని బిజెపికి అనుకూలంగా ప్రభావితం చేసే పనిని జగన్ కు అప్పచెప్పిన్నట్లు తెలుస్తున్నది.
అంతేకాకుండా, కర్ణాటక ఎన్నికల వ్యయాన్ని సహితం సింహభాగం జగన్ భరించడానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ .. తదితర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా బిజెపికి జగన్ భారీ మొత్తాలలో నిధులు సమకూర్చినట్లు చెబుతున్నారు.
‘అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేసుల నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరింది. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంతో వివేకానంద రెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుంది’ అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు.