రోడ్డు మీదకు వచ్చి, బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చొని, ఎవరొస్తారో రావాలంటూ వైసిపి శ్రేణులకు ఎమ్యెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలపై పార్టీ నుండి బహిష్కరణకు గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు.
వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తర్వాత నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఆయనను నియోజకవర్గం నుంచి తరిమికొడతామని హెచ్చరించాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేకపాటి గురువారం రోడ్డు మీదకు వచ్చారు. బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చున్నారు.
ఉదయగిరి బస్టాండ్‌కు ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు కూడా భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు `వైసీపీ ద్రోహి మేకపాటి నియోజకవర్గం నుంచి వెళ్లిపో’ అంటూ ఉదయం ప్లకార్డులతో ఉదయగిరిలో ఆయన ప్రత్యర్ధులు ర్యాలీ నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి మర్రిపాడు నుంచి ఉదయగిరికి చేరుకుని సవాల్ విసిరారు. ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అయినా కూడా పార్టీ అధిష్టానం తనపై అభాండాలు వేసి సస్పెండ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీలో లేనని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ప్రజలు ఆదరించడం వల్లే తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు. ఎవరొస్తారో రండి.. తరిమికొట్టండి అని సవాల్ విసిరారు. బస్టాండ్ సెంటర్‌లో కలియతిరిగారు. వైసీపీ నాయకత్వం తనపై అభాండాలు వేసి సస్పెండ్ చేసిందని ఆరోపించారు. దమ్ముంటే తనను ఇక్కడి నుంచి నుంచి తరిమికొట్టాలని సవాల్ విసిరారు.
వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే మేకపాటి దూకుడు పెంచారు. తనను టార్గెట్ చేస్తున్న నేతలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తనకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్‌కు సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తామని సవాల్ చేశారు.
గెలవలేకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. సింగిల్ డిజిట్‌తో గెలిచిన అనిల్, 35 వేల మెజార్టీతో గెలిచిన తనకు సవాల్ విసరడం ఏంటని అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.