అవినాష్ రెడ్డిలో అరెస్ట్ భయం..  ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Sunday, November 17, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా సిబిఐ పేర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలో ఇప్పుడు అరెస్ట్ భయం నెలకొన్నట్లు స్పష్టం అవుతుంది. గత వారమే అవసరమనుకుంటే ఆయనను అరెస్ట్ చేసుకోవచ్చని, తాము జోక్యం చేసుకోమని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే, ఆ నాదే సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడం, అప్పటి వరకు హడావుడి చేసిన సిబిఐ నిస్తేజంగా మిగిలిపోవడంతో ఇప్పట్లో అరెస్ట్ ఉండకపోవచ్చని అందరూ భావించారు. అయితే ఇంతలో ఈ కేసు విచారణలో సిబిఐ పురోగతి సాధించాక పోవడం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టడంతో నిందితులలో కలకలం రేపుతున్నది. పైగా, ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు ఒక సీనియర్ అధికారిని నియమించామని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 

దానితో అరెస్ట్ అనివార్యం కావచ్చనే భయంతో అనుకుంటా తెలంగాణ హైకోర్టులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మంగళవారం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు సార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి గతంలోనే అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

ఈ కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయడంతో పాటు హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని స్పష్టం చేయడంతో మరో వారం రోజులలోనే కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నది. సిబిఐ కొన్ని తీవ్రమైన చర్యలకు దిగక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కీలక నిందితుల పట్ల మరెంతోకాలం ఉదాసీనంగా వ్యవహరించలేక పోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ విచారణ వేగవంతం కానున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles