ఏదో విధంగా వచ్చే నెల నుండి విశాఖపట్నం నుండే రాజధాని కార్యకలాపాలు సాగించాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతి మాత్రమే రాజధాని అంటూ స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించడం పిడుగుపాటు పడినట్లయింది.
పైగా, అత్యవసరంగా కేసు విచారణకు సహితం ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదని. కేసు తదుపరి విచారణను ఏకంగా మూడు నెలల తర్వాత జులై 11న చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. అంతకు ముందు దీని విచారణ సాధ్యం కాదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.
అమరావతిపై పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరినా, తమ స్టే పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్థం లేదని ఏపీ తరఫున కెకె వేణుగోపాల్ వాదించినా ధర్మాసనం వినిపించుకోలేదు.
ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16వ తేదీన జస్టిస్ కెఎం జోసెఫ్ పదవీ విరమణ చేస్తుండడంతో ఈ కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దానితో జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తాను రిటైర్ అవుతున్న సమయంలో అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది.
త్వరలోనే వైజాగ్‌కు మకాం మార్చుతానని పలుమార్లు జగన్ బహిరంగ సభల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సుప్రీంలో అమరావతి కేసు విచారణలో ఏం తేలుతుందో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేయడంతో సీఎం జగన్ కు చుక్కెదురు అయినట్లయింది.
వాస్తవానికి జనవరి 31న ఈ పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు రావాల్సి ఉంది. కొంత జాప్యం చోటుచేసుకోవడంతో మార్చి 28న విచారణ జరిగింది. కాగా, రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే.
ఈ కేసులో వాద, ప్రతివాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, అందరి వాదనలు వినాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. అలాగే అనేక కీలక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ దశలో కనీసం హైకోర్టు తీర్పుపై ‘స్టే’ కోరుతూ దాఖలు చేసిన తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు.
అయితే ఇంకా అనేక కేసులు విచారణ జరపాల్సి ఉందని, ఇదొక్కటే కాదని ధర్మాసనం పేర్కొంది.
మరోవంక, అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాదు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం స్పష్టం చేసింది.
ఒక వంక, అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయగా, మరోవంక హైకోర్టు తీర్పును యథాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ధర్మాసనం ఈ రెండు పిటీషన్లను కలిపి విచారించాల్సి ఉంది.