ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్యెల్యేలు పార్టీ నాయకత్వంపై ముప్పేట దండయాత్ర చేస్తున్నారు. వారిలో అమరావతి ప్రాంతంకు చెందిన తాడికొండ ఎమ్యెల్యే, ఎస్సి సామాజిక వర్గంకు చెందిన ఉండవల్లి శ్రీదేవి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు `రిటర్న్ గిఫ్ట్’ ఇస్తా అంటూ హెచ్చరిస్తున్నారు.
తన భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆమె తాను వైసీపీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకున్నా.. ఓ కుట్ర ప్రకారం తనను సస్పెండ్ చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. రూ. కోట్లలో ఆస్తులు, రెండు పెద్ద ఆస్పత్రులు కూడా ఉన్న తాము రూ. 10 కోట్లకు అమ్ముడు పోయామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు స్థానిక ఎమ్యెల్యేగా దూరంగా ఉంటున్న అమరావతి రైతుల పోరాటంలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రం నుండి నిలదీస్తానని అంటూ శ్రీదేవి హెచ్చరించారు. దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని అంటూ ఆమె పార్టీ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
పోలింగ్ పూర్తి కాకుండానే తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున సొంత పార్టీ నేతలే ప్రహకారం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో తనపట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఉండటం, తనను పార్టీ నుండి సస్పెండ్ చేయగానే గుంటూరులో తన కార్యాలయంపై దాడులు చేయడం పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గత మూడు రోజులు గా వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని, థానితో తాను అజ్ఞాతంలో ఉన్నానని చెబుతూ మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా తనను కూడా చంపుతామని బెదిరిస్తుండడంతో అజ్ఞాతంలోకి వెళ్ళానని ఆమె దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేశారు.
వాళ్ళ దందాలకు తాను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారని మండిపడుతూ “నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా?” అని ఆమె నిలదీశారు. లేదా సీసీ కెమెరా పెట్టారా? అని ప్రశ్నించారు. “నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు?.. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? అంటూ ఆమె పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు.
రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై దొంగ అనే ముద్ర వేశారని, డబ్బులు తీసుకుని పారిపోయానని అంటున్నారని ఆమెఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భర్త ప్రముఖ వైద్యులమని, తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
మహిళను అని చూడకుండా ఇష్టారీతిగా విమర్శిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. అమరావతి పోరాటంలో ఇప్పటి నుంచి రాజధాని రైతుల పోరాటంలో తాను భాగస్వామిని అవుతానని శ్రీదేవి వెల్లడించారు.
అమరావతికి వైఎస్ జగన్ ద్రోహం చేశారని స్పష్టం చేస్తూ ఎన్నికల సమయంలో అమరావతిలోని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు.. రాజధాని గురించి తనను అందరూ అడిగితే జగనన్న తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నారని వారికి చెప్పానని ఆమె గుర్తు చేశారు. కానీ, గెలిచిన తర్వాత మూడు రాజధానుల తెరపైకి తీసుకొచ్చారని, అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల పథకం అనేది ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు.