ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా చట్టసభలలో జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మొన్నటివరకు కేవలం శాసనమండలిలో బిజెపికి ఒక సభ్యుడు – పివిఎన్ మాధవ్ ఉండేవారు. అయితే ఆయన కూడా తాజాగా జరిగిన పట్టభద్రుల నుండి ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటమి చెండంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యం కోల్పోతుంది.
ఇప్పటికే శాసనసభలో వైసిపి, టిడిపి తప్ప మరో పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఏపీ నుండి ఎంపీలు సహితం ఆ రెండు పార్టీలకు చెందినవారే. బీజేపీకి నుండి జివిఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ ఆయన ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు.
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58గా ఉంది. వీరిలో అధికార వైసిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 33 నుంచి, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి 45కు చేరుకోనుంది. ప్రతిపక్ష టిడిపి సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది.
పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. బిజెపికి గల ఉన్న ఒక్క సభ్యుడూ తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. మొత్తంమీద, చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్షాలకు కూడా ప్రాతినిధ్యం లేదు.
తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైసిపి, 4 స్థానాలు టిడిపి దక్కించుకున్నాయి. టీడీపీకి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, అంటే 29న కొందరు, మే నెలాఖరుతో మరికొందరి సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు.