అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ

Tuesday, November 5, 2024

రాజధానిగా అమరావతిని నిర్వీర్యం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన కక్షసాధింపు, వివక్షాపూర్వక ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసేందుకు మరోసారి రాజధాని రైతులు సిద్ధమయ్యారు.

ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా, రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది.

పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.

రాజధాని బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4 (హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.

అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ప్రత్యేకంగా ఆర్‌5 జోన్‌ ఏర్పాటుచేసింది. ఈ మేరకు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల వంటి రాజధానికి వెలుపలి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు అమరావతిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో జీవో విడుదల చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేయగా కోర్టు ఆ జీవోను ఇంతకు ముందే కొట్టేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి, ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టంలో రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలల క్రితం సవరణలు చేసింది. దాన్ని సవాలుచేస్తూ రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగాన రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేయడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles