గురువారం జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు పెను సవాల్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. కేవలం ఒక్క ఓటు అదనంగా సంప్రదించకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అడ్డుకోగలరా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఏడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికవుతామన్న ధీమాతో వైసిపి అభ్యర్థులు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనూరాథను పోటీకి దింపడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.
టిడిపి అభ్యర్థి గెలుపొందితే అధికార పక్షం నుండి ఎవ్వరో ఒకరు ఓటమి చెందక తప్పదు. ఇప్పటికే పట్టభద్రుల స్థానాల నుండి మొత్తం మూడు ఎమ్యెల్సీ సీట్లలో పరాజయం మూటగట్టుకున్న వైసీపీకి ఈ స్థానం కూడా కోల్పోతే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర పరాభవంగా మారగలదు. ఇక వైసీపీ ఓటమి అంచున ఉందనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చిన్నట్లు కాగలదు.
ఒకొక్క అభ్యర్థి గెలుపొందడానికి 22 ఓట్లు అవసరం కాగలదు. టిడిపికి 23 మంది ఎమ్యెల్యేలు ఉన్నప్పటికీ వారిలో నలుగురు వైసీపీతో తిరుగుతూ ఉండడంతో టిడిపి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఏమాత్రం లేదు. అయితే వైసిపిలో అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తాము `ఆత్మప్రబోధం’ అనుసారం ఓటువేస్తామని ప్రకటించడంతో టిడిపికి ఓటు వేస్తున్నట్లు స్పష్టమైంది. అంటే మరో ఓటు పొందగలిగితే టిడిపి అభ్యర్థి సునాయానం కాగలదు.
మరోవంక, వైసీపీతో తిరుగుతున్న నలుగురు సహితం తమకు ఓటువేయని పక్షంలో ఎమ్యెల్యేలుగా అనర్హులుగా ప్రకటించేటట్లు చేయడం కోసం టిడిపి ఇప్పటికే విప్ జారీచేసింది. మరోవంక వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్యెల్యేలు టిడిపితో టచ్ లో ఉన్నారని తెలియడంతో వారి కదలికలపై వైసీపీ నిఘా ఏర్పాటు చేసింది.
పంచుమర్తి అనూరాధను గెలిపించి మండలికి పంపాలని పట్టుదలతో టిడిపి వర్గాలు కసరత్తు చేస్తుండటం అధికార పక్షంలో కలకలం రేపుతోంది. కనీసం 20 మంది వైసిపి ఎమ్యెల్యేలు చంద్రబాబు నాయుడుకు అందుబాటులో ఉన్నారని, వారిలో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సిద్దమయ్యే అవకాశాలున్నాయన్న సమాచారంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెల్చుకున్న జోష్ లో ఉన్న టిడిపిని కట్టడి చేయలేని పక్షంలో 2024 ఎన్నికల వరకు వారి దూకుడును అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చని అధికార పక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు వైసిపి విప్ జారీ చేయలేదు. ఒకవేళ జారీచేసిన ఓటింగ్ కు హాజరై తమ ఓటు చెల్లని విధంగా ఓటు వేయడం ద్వారా ప్రత్యర్థి పక్షంలు మేలు చేసే అవకాశం కూడా లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
సీఎం జగన్ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లకుండా ఉండేవిధంగా ఓటువేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ కసరత్తు ఏమేరకు ప్రయోజనకారి కాగలదో చూడవలసి ఉంది.