మార్గదర్శిపై జగన్ దూకుడుకు తెలంగాణ హైకోర్టు కళ్లెం!

Wednesday, November 13, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో మార్గదర్శి కార్యాలయాలను మూయించివేయడంతో పాటుఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును అరెస్ట్ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంకు తెలంగాణ హైకోర్టు కళ్లెం వేసింది. ఈ విషయంలో ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌, సిఐడిలు ప్రదర్శిస్తున్న దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసింది.

మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజాకిరణ్, మార్గదర్శి చిట్స్‌పై కేసులు నమోదైన నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలొద్దని కోర్టు ఆదేశించింది. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఏపీ సిఐడి కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టులో సంస్థ ప్రతినిధులు సవాలు చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కేసులు తేలే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూా ఆ సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్గదర్శి వివాదానికి సంబంధించి ఇప్పటికే రెండు పిటిషన్‌లు తెలంగాణ హై కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో భిన్నమైన ఉత్తర్వులు రాకుండా నివారించడానికి అన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది.

మార్గదర్శికి వ్యతిరేకంగా నాలుగు నెలల క్రితం పత్రికా ప్రకటనలు వెలువడినా ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని, చిట్‌ఫండ్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నందున ఛైర్మన్‌, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది.

ఏపీలో నమోదైన కేసులను కొట్టి వేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ కె.సురేందర్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆరోపణలన్నీ పెట్టుబడులు పెట్టారంటూ చేసినవేనని, ఖాతాదారుల సొమ్మును ఖాతాల్లో చూపలేదని గానీ, కనిపించకుండా చేశారన్నది కాకపోవడం గమనార్హం ఏపీ అధికారులు ఆరోపించిన విధంగా ఒక వేళ చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారుని మోసగించడం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది.

కాగా, ఏపీలో సోదాలు జరిగితే తెలంగాణ హైకోర్టులో పిటీషన్ చెల్లదని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనను కూడా హైకోర్టు తిరస్కరించింది.  పిటిషనర్లు హైదరాబాద్‌లో నివాసం ఉండటంతో పాటు మార్గదర్శి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉందని, బ్రాంచిల ద్వారా చందాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి పంపి పెట్టుబడులు పెడుతున్నారన్నది పిటిషనర్లపై ప్రధాన ఆరోపణ అని, అందువల్ల అధికరణ 226(2) ప్రకారం ఈ కోర్టుకు విచారణ పరిధి ఉందని ప్రకటించారు.

నవీన్‌చంద్ర ఎన్‌.మజీతియాస్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రకారం మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఉత్తర్వులు జారీ చేసే పరిధి ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేశారు. పైగా, చిట్‌ఫండ్‌ కంపెనీపై నమోదైన ఫిర్యాదులన్నీ ఒకేలా ఉన్నాయని ఈ కోర్టు గమనించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

 ఒక్క ఫిర్యాదు కూడా చందాదారు నుంచి రాలేదని, టి.టి.ఆంటోనీ వర్సెస్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. ఒకే నేరానికి సంబంధించి అందే ఫిర్యాదులపై ఎక్కువ కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ఈ కేసులోనూ ఆరోపణలన్నీ ఒకటే అయినప్పటికీ ఏపీలోని చాలా పోలీసుస్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles