ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న సిబిఐ ఇప్పుడు ఎటువైపు వెడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి ఈ హత్యకేసులో కీలక వ్యక్తులు అని, వారిని అరెస్ట్ చేయవలసిందే అని హైకోర్టులోనే స్పష్టం చేసిన సిబిఐ, అందుకు సానుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చి నాలుగు రోజులవుతున్నా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తుంది.
తీవ్రమైన చర్యలు తీసుకొనేందుకు సిద్దమవుతూ మౌనంగా ఉందా? లేదా దూకుడు తగ్గించమని ఢిల్లీ నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సహితం సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లడం, సిబిఐ మౌనం వహించడం పలు సందర్భాలలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంపై కేసు విచారణ హైదరాబాద్ కు బదిలీ అయినా తర్వాతనే ఈ కేసులో దూకుడు తిరిగి పెరిగింది.
అవినాష్ రెడ్డిని అవసరం అనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే జగన్ ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం తెలిసిందే. అదే రోజు సాయంత్రం ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. కేవలం హైకోర్టు తీర్పు ప్రతికూలంగా రాగలదని ఉద్దేశ్యంతోనే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఆయన హడావుడిగా ఢిల్లీ ప్రయత్నం అయ్యారన్నది బహిరంగ రహస్యమే.
అయితే, సిబిఐ దూకుడు గురించి ప్రధాని, హోమ్ మంత్రి లతో జగన్ ఎటువంటి చర్చలు జరిపారు? వారి నుండి ఏమైనా హామీలు లభించాయా? అనే విషయాలపై ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి కధనాలు వెలువడలేదు. అయితే, ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కు, మరో రెండు నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జగన్ లింక్ పెట్టారని తెలుస్తున్నది.
గతంలో ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ తనవంతుగా బిజెపికి సహకారం అందించారు. కర్ణాటకలో తెలుగు వారి జనాభా, ముఖ్యంగా రాయలసీమకు చెందిన వారి జనాభా గణనీయ సంఖ్యలో ఉంది. వారి కనీసం 20 నుండి 25 నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేయగలరు.
బిజెపి నుండి బయటకు వెళ్లి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని, ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీ చేస్తున్న గాలి జనార్ధనరెడ్డి సహితం ఈ నియోజకవర్గాలపైననే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. జనార్దన్ రెడ్డి కి, జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆర్ధిక లావాదేవీలు కూడా ఉన్నాయి. అందుకనే జనార్ధనరెడ్డి కారణంగా బిజెపికి నష్టం జరగకుండా చూసే బాధ్యతను జగన్ కు బిజెపి పెద్దలు అప్పచెప్పారనే ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా, తన పలుకుబడి ఉపయోగించి కర్ణాటకలోని పలు నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం చేయవలసిన ప్రయత్నాలు కూడా చేస్తారు. కొందరు వైసీపీ ప్రముఖులు కర్ణాటకలో మకాం వేసి, అక్కడ స్థిరపడిన పలుకుబడి కలిగిన వారిని బిజెపికి అనుకూలంగా పనిచేసే విధంగా చూస్తారు. వీటితో పాటు ఎన్నికల ప్రచారంకోసం ఆర్ధికంగా అండదండలు కూడా అందిస్తారు.
బిఆర్ఎస్ పార్టీతో జేడీఎస్ అధినేత హెచ్ డి కుమారస్వామితో పొత్తు పెట్టుకొని, కర్ణాటకలో బీజేపీ ఓటమికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్న సమయంలో జగన్ బిజెపిని ఆదుకొనేందుకు బీజేపీ పెద్దలకు భరోసా ఇచ్చారని చెబుతున్నారు.
అదే నిజమైతే వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సిబిఐ కొంతమేరకు దూకుడు తగ్గించవచ్చని, అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేసినా తొందరగా బెయిల్ లభించేందుకు సహకరించవచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఏదిఏమైనా, సిబిఐ నిబద్ధతకు ఈ కేసు ఒక నిదర్శనంగా మిగిలే అవకాశం ఉంది. బిజెపి అగ్రనాయకులు చెబుతున్నట్లు సిబిడి, ఈడీలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ సత్వరమే జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా, బీజేపీ రాజకీయ ప్రయోజనాలకోసం పనిచేస్తుంటే ఈ కేసు విషయంలో దూకుడు తగ్గించే అవకాశం ఉంటుంది.