ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి మరో అప్డేట్ వచ్చింది. మూడురాజధానుల విషయంలో హైకోర్టు తీర్పులు, సుప్రీం కోర్టులో వ్యవహారం పెండింగ్ ఉండడం ఇదంతా గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా.. తాను మాత్రం తలచింది చేసి తీరాల్సిందే అని ఎంతో పట్టుదలగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. మరోసారి స్వయంగా విశాఖకు రాజధాని తరలివెళ్లనుందని ప్రకటించారు. జులైలో విశాఖకు వెళుతున్నాం, జులైలో విశాఖనుంచే పాలన మొదలవుతుంది అని జగన్మోహన్ రెడ్డి, మంగళవారం నాటి కేబినెట్ బేటీ తర్వాత.. మంత్రులతో పిచ్చాపాటీగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ లో చిల్లరనాయకులు, కీలక నాయకులు, చివరికి మంత్రులు వీళ్లందరూ.. ఇదిగో అదిగో విశాఖకు రాజధాని వచ్చేస్తున్నదంటూ పదేపదే ప్రకటనలు చేయడం ఒక ఎత్తు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అలాంటి ప్రకటన చేయడం మరో ఎత్తు. అందుకే.. ఢిల్లీలో పెట్టుబడిదారులతో జగన్ స్వయంగా.. మరి కొన్ని నెలల్లో నేను కూడా విశాఖకు మారుతున్నాను. రాజధాని అక్కడినుంచే పనిచేస్తుంది అని చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం అయ్యాయి. అప్పుడేదో పెట్టుబడిదారుల్లో విశాఖపట్ల ఆసక్తిని పెంచడానికి ఆయన అలా చెప్పి ఉండవచ్చునన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తం అయింది. ఒకవైపు రాజధానికి సంబంధించి.. మూడురాజధానుల నిర్ణయాధికారమే రాష్ర్టప్రభుత్వానికి లేదని అంటూ.. అమరావతిలో మాత్రమే రాజధానిని కొనసాగించాలని అంటూ హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పిన తర్వాత.. ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఇప్పటిదాకా ఏమీ తేల్చలేదు. ఇప్పుడే తేలుతుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నెలతో సహా.. జులైనుంచి విశాఖ రాజధానిగా పాలన సాగుతుందని అనడం ఆశ్చర్యకరం.
సుప్రీం కోర్టులో పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన భావిస్తున్నారా? సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నారా? అనేది కొందరి అనుమానం. సుప్రీం తీర్పు వచ్చినా రాకపోయినా.. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జగన్ తనకు తోచిన నిర్ణయం తీసుకున్నా విస్తుపోయే పనిలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. జగన్ మొండితనంగా చేయదలచుకుంటే.. ముందు రాజధానిని మార్చేసి.. ఆ తర్వాత దాని వల్ల రాగల న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే.. వాటి గురించి అప్పుడు తేల్చుకోవచ్చునని అనుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఒకవైపు వ్యవహారం కోర్టులో నలుగుతూ ఉండగానే.. ముఖ్యమంత్రి విశాఖ రాజధానికి ముహూర్తం పెట్టేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
జగన్.. పంతం మాత్రమేనా? ఓ లెక్కంటూ ఉందా?
Friday, November 15, 2024