రామోజీరావు మీద కక్ష కట్టి వేధించడంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ‘తండ్రిని మించిన తనయుడిని’ అని నిరూపించుకుంటున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అచ్చంగా రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న లోపం, జరుగుతున్న తప్పు మీద దృష్టి పెట్టారు. ఉండవిల్లిని ఒక అస్త్రం లాగా ప్రయోగించి రామోజీరావు మీదికి ఎక్కుపెట్టి వదిలారు. ఉండవల్లి ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు. ఎవరినీ ఒక్క రూపాయి కూడా మోసం చేయకపోయినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వ్యాపారాన్ని రామోజీరావు మూసుకోవాల్సి వచ్చింది. కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు జరుగుతూ ఉంటే దానిమీద పరిశోధించి ఇరికించడం కాదు, అక్కడి వరకే ఆయన పరిమితం కాదలుచుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలలో జరుగుతున్న కార్యకలాపాలను తప్పులుగా పనిగట్టుకుని నిరూపించి, ప్రయత్న పూర్వకంగా అవన్నీ అక్రమ లావాదేవీలే అని చాటి చెప్పి ఆ తరువాత ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా ప్రభుత్వ విభాగాలను, దర్యాప్తు సంస్థ లను ఉపయోగిస్తున్నారు.
తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక వ్యక్తిని ప్రయోగించి వదిలేసారు. కానీ కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారం తన చేతిలో ఉన్నది కనుక రెండు ప్రభుత్వ శాఖలను అదే పనిగా నిర్దేశించి మార్గదర్శి వెంటపడుతున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రామోజీరావుకు తన సత్తా ఏమిటో చూపించి ఒక కొరడా దెబ్బతో హెచ్చరిక చేయదలచుకుంటే.. కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏకంగా రామోజీరావు వ్యాపార సామ్రాజ్యపు మూల స్తంభం మూసివేతకు కంకణం కట్టుకున్నారు. ఈ పోలికతో చూసినప్పుడు రామోజీరావు మీద కక్ష సాధించే విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగాను తండ్రి మించిన తనయుడు అనిపించుకున్నారు.
సాధారణంగా శత్రువు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనేది రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబునాయుడు, ఇతర కొంతమంది తెలుగుదేశం నాయకుల ప్రధాన వ్యాపారం అయిన డెయిరీ వ్యాపారాలకు చెక్ పెడుతూ అమూల్ ను తీసుకువచ్చారు. రాజకీయ ప్రత్యర్థులతో ఆయన ఆగలేదు. చంద్రబాబు కంటె ఇంకా పెద్ద శత్రువుగా పరిగణిస్తున్న రామోజీరావు మీద కూడా ఫోకస్ పెట్టారు. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాలతో రామోజీరావుకు నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన పేరు కూడా కేసుల్లో ఉండడం గమనార్హం.
రైటే.. తండ్రిని మించిన తనయుడు జగన్!
Wednesday, December 25, 2024