అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్టులతో సిబిఐ సరిపెడుతుందా!

Sunday, November 17, 2024

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడే అరెస్ట్ చేయకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు నుండి ఉత్తరువు తెచ్చుకొన్నప్పటికీ, అతడితో పాటు అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయవలసిందే అని సిబిఐ న్యాయస్థానాల్లో స్పష్టం చేయడంతో అటూ, ఇటూగా అరెస్ట్ తప్పదని వెల్లడవుతుంది. 

అవినాష్‌ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సీబీఐ సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు అందజేసింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది.

వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్‌ చేసింది. పైగా, అవినాష్ కోరినట్లు వివేకా హత్య కేసులో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అదీగాక, సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సిబిఐ విచారణ జరుపుతున్న తీరుపట్ల విమర్శలు  చేయడం పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదంతా చూస్తుంటే అవినాష్, భాస్కరరెడ్డిల అరెస్ట్ అనివార్యం అని వైసిపి నాయకత్వం కూడా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది.  అయితే, వారిద్దరి అరెస్టులతో సిబిఐ సరిపెట్టుకొంటుందా? లేకపోతే కీలక సూత్రధారుల కోసం విచారణను కొనసాగిస్తారా?? అన్న భయాందోళనలు ప్రభుత్వంలోని పెద్దలలో వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.

 వైయస్ అవినాష్ రెడ్డి ని నిందితునిగా కాకుండా, సాక్షిగా పిలవడం వెనుక సిబిఐ అధికారులు కీలక సూత్రధా రులను వెతికే పనిలో ఉన్నారనే సంకేతం వెలువడుతుంది. అవినాష్ రెడ్డిని సాక్షిగా పిలిచి కొన్ని వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ ల వాయిస్ వినిపించి ఇది ఎవరిదని ప్రశ్నించే అవకాశం ఉందనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కాగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండడంతో సీబీఐ అధికారులు విచారణ జరపకుండా చూడాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.‘‘మీరే పిటిషన్ వేస్తారు.. మీరే పార్లమెంట్ ఉందని చెప్తారు.. ఆర్డర్ రేపే ఇవ్వవొచ్చేమో’అంటూ హైకోర్టు అసహనం తెలిపింది. మంగళవారం విచారణకు పిలవకూడదు అనుకుంటే సీబీఐ అనుమతి తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో ఆరోపించారు. ఎంపీ టికెట్ కోసం హత్య చేసినట్లు భావిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్‌‌రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని,  వివేకా హత్యకు ముందు అవినాశ్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని ఆమె తన  పిటిషన్‌లో పేర్కొన్నారు.

విచారణకు సహకరించకుండా కోర్టుల్లో అవినాశ్‌ తప్పుడు కేసులు వేస్తున్నాడని, తనపై, తన కుటుంబంపై, దర్యాప్తు అధికారులపై అవినాశ్‌ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని, ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాశ్‌ను కాపాడాలని చూస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles