పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక మీద నిలబడి డ్యాన్సు చేస్తుందని సామెత. ఇప్పుడు ఏపీలో పరిస్థితి కూడా అలాగే ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం వైఖరి.. నిబంధనల అతిక్రమణ విషయంలో గుడ్డి దర్బారును తలపిస్తోంటే.. ఎవరికి వారు డబ్బు పంపిణీ వంటి అరాచకాలతో చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ ఈ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా, ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లుగా ప్రతిచోటనుంచి ఆరోపణలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఓటర్లు- పంచాయతీల వారీగా ఎంత డబ్బులు వెళ్లాయో, ఓటర్లకు అందాయో లేదో చెక్ చేసుకోవాలని అంటూ, డబ్బు పంపిణీపై పార్టీ కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ వీడియోకు దొరికిపోవడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరితెగింపునకు పరాకాష్ట.
ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం మొదలైన నాటినుంచి.. అధికార పార్టీ అరాచకాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల విషయంలో ఇతరులను అసలు నామినేషన్లు వేయినవ్వకుండానే అడ్డుకోవడం, వచ్చిన వారిని బెదిరించి పంపడం వంటివి జరిగాయి. వేసిన నామినేషన్లను తిరస్కరించడం, అనర్హులుగా ప్రకటించడం కూడా జరిగాయి. ప్రపోజ్ చేసిన వారితో ఫోర్జరీ సంతకాలు అని చెప్పించడం ద్వారా కూడా కొన్నింటిని తిరస్కరింపజేశారు.
తీరా పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసరికి డబ్బు పంపిణీ దందా బీభత్సంగా జరుగుతోంది. బిఇడి సర్టిఫికెట్ ఉన్నవారికి అయిదువేలు ఇస్తున్నట్టుగా, ఇతర పట్టభద్రులకు వెయ్యిరూపాయలు, రెండు వేలు రకరకాలుగా ఇస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఎక్కడ కూడా అధికార పార్టీ నాయకుల మీద ఈసీగానీ పోలీసులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు సాక్షాత్తూ మంత్రి ఉషశ్రీచరణ్ ఓటర్లకు డబ్బు పంచే వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మనం డబ్బు పంచే పనేలేదు.. మనం చేపట్టే సంక్షేమమే గెలిపిస్తుంది అని తన పాలన గురించి తాను అతిశయంగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరువు తీసేలా డబ్బు పంపిణీతో దొరికిపోయిన మంత్రి ఉషశ్రీ చరణ్ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా ఉంది. అసలు ఈ వ్యవహారాల మీద ఈసీ స్పందించకపోవడం ఇంకో ఎత్తు. ఈసీ గుడ్డి వైఖరి వల్లనే అధికార పార్టీలో ఇంత బరితెగింపు వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి బరితెగింపు పంపకాలు.. ఈసీ గుడ్డిదైతే..
Thursday, December 19, 2024