కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకొని బిజెపి మరో తప్పటడుగు వేస్తుందా!

Tuesday, November 5, 2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. పైగా, హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏడాది చివరిలోగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన బీజేపీలో కీలక పాత్ర వహించబోతున్నట్లు చెబుతున్నారు.

అయితే, 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అందుకోసం ముఖ్యమంత్రితో సమానమైన హోదా కలిగిన ఓ పదవిని కేంద్ర ప్రభుత్వంలో ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ విధంగా చేస్తే, తాను సొంతంగా రూ 3,000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకొని 2019 ఎన్నికలలో ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చేవిధంగా కృషి చేయగలనని ఒక ప్రణాలికను కూడా బిజెపి నాయకత్వం ముందుంచారు.

అంతే కాదు, తనతో పాటు అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా తీసుకు వస్తానని చెప్పారు. కానీ, అప్పటికే కాంగ్రెస్ నుండి వచ్చి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి చేరితే పార్టీలో తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భయంతో బిజెపి అధిష్టానాన్ని ఈ విషయంలో తప్పుదారి పట్టించారు.

ఆ తర్వాతనే ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరి, 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. తిరిగి 2024లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు జరిపిన నేత కాదు. తన నియోజకవర్గానికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరులు అందరూ తమ్ముడితో ఉన్నారు.

పైగా, చివరివరకు రాష్త్ర విభజనను గట్టిగా వ్యతిరేకించడమే కాకుండా, అదేవిషయమై ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడ విద్యుత్ లేక ప్రజలు చీకటిలో మగ్గవలసి వస్తుందని ఘాటైన వాఖ్యలు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయనను బీజేపీలో చేర్చుకొని, తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి తీసుకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మాస్త్రం అందించినట్లు కాగలదు.

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ చేతులు కలపడంతో తిరిగి `ఆంధ్రావాళ్ల పెత్తనం’ వస్తుందంటూ సెంటిమెంట్ రగిల్చి ఎన్నికలలో కేసీఆర్ లబ్ధి పొందటం మరచిపోలేము. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుంటే కేసీఆర్ కు అటువంటి మరో ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపిని సీఎం వైఎస్ జగన్ `బి’ టీమ్ గా జనం పరిగణిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలకు తిలోదకాలివ్వడంతో  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శత్రువుగా ప్రజలు భావిస్తున్నారు. నోటా కన్నా తక్కువ ఓట్లున్న అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి చేసెడిది ఏమీ ఉండబోదు. అసలు ఏపీలో జగన్ ను ఎదుర్కొని, సొంతంగా నిలబడాలని బిజెపి కోరుకొంటుందా? అన్నదే ఆ పార్టీ అధిష్టానం తేల్చుకోవాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles