‘బేటీ బచావ్’ దేశవ్యాప్త ఉద్యమం అవుతుందా?

Thursday, November 14, 2024

గ్రహాలన్నీ కక్ష కట్టినట్టుగా నడుస్తున్నాయా? సంకేతాలు అన్నీ ప్రతికూలంగా మాత్రమే కనిపిస్తున్నాయా? మొత్తానికి కల్వకుంట్ల కవిత పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఆమె మాటల్లో దూకుడు గమనిస్తోంటేనే.. అరెస్టు తప్పదనే భావన పలువురికి కలుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టుచేసిన వారికి, అదే కేసులో తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేయడం పెద్ద విషయం ఎంతమాత్రమూ కాదు. ఆ స్థాయి అరెస్టులు జరుగుతున్నప్పుడు.. పూర్తి నిరాధారంగా వారు అడుగు ముందుకు వేస్తారని అనుకోవడం కూడా కరెక్టు కాదు. కవిత అరెస్టు జరిగితే.. అది భారత రాష్ట్ర సమితికి అతిపెద్ద కుదుపు అవుతుంది.
ఇప్పుడిప్పుడే దేశ రాజకీయాల్లోకి విస్తరించి.. ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరేయాలని తపన పడుతున్నకేసీఆర్ కలలకు అది విఘాతమే. కేంద్రం కక్ష సాధింపు ధోరణులకు దిగుతున్నదని, కేసీఆర్ అంటే జడుసుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేసినా.. వారికి జరిగే డేమేజీ ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఇప్పుడు వీలైనంతగా ఎదురుదాడికి దిగాలి. అదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ బలాన్ని ఓసారి సమీకరించుకోవడానికి.. పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు ప్రజలు భావిస్తున్నారు.
కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేని తన తండ్రి వైఖరిని అడగలేకపోయిన ఈ నాయకురాలు.. దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం గురించి.. అన్ని పార్టీలను పోగేసి అతిపెద్ద దీక్ష చేస్తున్నారు. పనిలో పనిగా తన దీక్షకు పోరాటానికి జడిసి.. తనను ముందస్తుగా విచారణకు పిలుస్తూ కేంద్రం పిరికి వైఖరి అవలంబిస్తోందని కూడా అంటున్నారు. ఆమె ప్రస్తుతానికి దీక్ష తర్వాత 11న విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆమె బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పటికే కస్టడీలో ఉన్నారు గనుక.. ఇద్దరినీ కలిపి విచారించడం తథ్యం. అదేరోజున ఆమె అరెస్టు జరిగినా ఆశ్చర్యం లేదు.
అయితే కూతురిని కాపాడుకోవడం అనేది కేసీఆర్ తక్షణ కర్తవ్యంగా ఉంది. ఆయన తన పార్టీని సమాయత్తం చేస్తున్నారు. వారంతా ప్రభువు మనసెరిగి ముందునుంచే.. కేంద్రంలోని బిజెపిని తిట్టడం నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అయితే.. ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అయితేనే అక్కడే ఏమీ జరగలేదు. కవిత అరెస్టు అయితే.. ఏమవుతుంది. మరోసారి విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు.. ‘ఈ కక్ష సాధింపు అరెస్టులు వద్దు’ అంటూ ప్రధానికి మరో లేఖ రాయగలరు అంతే.
కానీ కూతురిని కాపాడుకోవాడానికి, బేటీ బచావ్ అనేది.. దేశవ్యాప్త ఉద్యమంగా మార్చాలనేది కేసీఆర్ కోరిక కావొచ్చు. కానీ.. అందుకు భారాస విస్తృతస్థాయి సమావేశంలో బీజం వేయవచ్చు. కానీ దేశంలని ఇతర పార్టీలు ఎంత మేర సహకరిస్తాయి అనేది వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles