లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా

Tuesday, November 5, 2024

మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధా టిడిపిని విడిచిపెట్టి జనసేనలో చేరబోతున్నారని అంటూ కొద్ది రోజులుగా మీడియాలో కధనాలు వస్తుండగా, మంగళవారం అకస్మాత్తుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న `యువగళం’ పాదయాత్రలో కనిపించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. తన రాజకీయ భవిష్యత్ గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని తనదైన శైలిలో రాధా తిప్పికొట్టినట్లయింది.

మంగళవారం ఉదయం పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యాత్రను లోకేష్ ప్రారంభించగా..ఈ యాత్ర లో వంగవీటి రాధా పాల్గొని ఆశ్చర్యపరిచారు. లోకేష్ యాత్ర లో స్వయంగా రాధ పాల్గొనడం… తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించడంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.

లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా  ముందుగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. నడుస్తూనే మధ్యలో తన అనుచరులను లోకేష్ కు పరిచయం చేశారు. దీంతో లోకేష్ కూడా ఆయనను ఆప్యాయంగా పలకరించారు.

లోకేష్‌ క్యారవేన్‌‌లో రాధా ప్రత్యేకంగా సమావేశమై గంటకుపైగా ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పు, సీటు విషయంపై చాలా స్పష్టంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. పైగా, లోకేష్‌తో భేటీ తర్వాత ఇకపై వారంలో రెండు సార్లు యువనేత పాదయాత్రలో పాల్గొంటానని రాధా చెప్పడం గమనార్హం.

‘ కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది చంద్రబాబుగారు నిర్ణయిస్తారు. టికెట్ వస్తే సరే లేకుంటే అధికారంలోకి రాగానే కచ్చితంగా మీకు ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ మారే ఆలోచనను విరమించుకోండి” అంటూ లోకేష్ ఆయనకు స్పష్టమైన భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.

రాధా 2019 ఎన్నికల ముందే టిడిపిలో చేరినా ఆ ఎన్నికలలో ఎక్కడి నుండి పోటీ చేయలేదు. కేవలం పార్టీ తరపున ప్రచారంపై పరిమితమయ్యారు. ఆ తర్వాత కూడా టిడిపి కార్యక్రమాలలో పెద్దగా చురుకుగా పాల్గొనడం లేదు. దానితో ఆయన పార్టీ మారబోతున్నారని అంటూ తరచూ కధనాలు వస్తున్నాయి. పైగా, వైసీపీ నేతలు సహితం ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మధ్యనే గుంటూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో పాల్గొనబోవడం ద్వారా టిడిపితో కలసి తన రాజకీయ ప్రయాణం ఉంటుందనే స్పష్టమైన సంకేతం రాధ ఇచ్చారు.

టిడిపి – జనసేన మధ్య చిచ్చు పెట్టి, తమ ప్రభుత్వం పట్ల ఆగ్రవేశాలలో ఉన్న కాపు సామాజిక వర్గం టిడిపితో ప్రయాణించకుండా అడ్డుకోవడం కోసం వైసిపి నాయకులు చేయవలసిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. ఆ పార్టీలోని కాపు మంత్రులను ఉపయోగించి ఒక వంక పవన్ కళ్యాణ్ పై, మరోవంక టిడిపిలో చేరుతున్న కాపు నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు.

అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడించే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు వెల్లడి అవుతుంది. అందుకనే వారు దుష్ప్రచారం ఎటువంటి ప్రభావం చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles