గవర్నర్ తమిళసై – కేసీఆర్ ప్రభుత్వం మధ్య ట్విట్టర్ వార్!

Friday, September 20, 2024

గవర్నర్ డా. తమిళసై, కేసీఆర్ ప్రభుత్వంల మధ్య నెలకొన్న విబేధాలు ఒకవంక సుప్రీంకోర్టుకు చేరుకోగా, మరోవంక ట్విట్టర్ లో వార్ కొనసాగుతుంది. తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం గురించి రాజ్ భవన్ కు వచ్చి సంప్రదించే ప్రయత్నం చేయకుండా ఢిల్లీలో సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై గత వారం ట్వీట్ ద్వారా గవర్నర్ ఈ పోరును ప్రారంభించారు.

తాజాగా, మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తులు పంపలేదని గవర్నర్ ట్వీట్ చేయగా, మంత్రి హరీశ్ రావు తిప్పికొట్టారు. రాష్ట్రం తరపున ప్రతిపాదనలు పంపామని చెబుతూగవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులు ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని హితవు చెప్పారు.

ప్రభత్వ మెడికల్ కళాశాలల అంశంలో.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ తమిళి సై చేసిన ట్విట్ వైరల్ గా మారింది. గవర్నర్ చేసిన చేసిన ట్వీట్ పై మండిపడుతూ నెటిజన్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు.

కేరళలోని కోజికోడ్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన స్పూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ హాస్పటిల్ ఫోటోలతో ట్వీట్ చేశారు.

దీనిని ర్వీట్వీట్ చేసిన గవర్నర్ తమిళి సై పీఎంఎస్ఎస్వై స్కీమ్ కింద జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి అత్యాధునికంగా నిర్మితమైన ఆసుపత్రులు అద్దం పడుతున్నాయని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 300 నుంచి 700కు పెంచిందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, 30 వేలుగా ఉన్న ఎంబీబీఎస్ సీట్లను లక్షకు పెంచిందని, పీజీ మెడికల్ సీట్లు 150 శాతం మేర పెరిగాయని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 15 ఎయిమ్స్ ఆసుపత్రులు, ప్రతి మెడికల్ కాలేజీలో కొత్తగా నర్సింగ్ కళాశాలలను ప్రారంభిస్తున్నారని అంటూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

గవర్నర్ చేసిన ఈ ట్వీట్లకు స్పందించిన ఓ నెటిజన్ తెలంగాణకు ఎన్ని మెడికల్ కళాశాలలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి తమిళిసై స్పందిస్తూ  పీఎంఎస్ఎస్వై స్కీమ్ కింద ప్రతి రాష్ట్రం మెడికల్ కళాశాలల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, కానీ కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పినట్లుగా సకాలంలో ప్రతిపాదనలు పంపడంలో తెలంగాణ విఫలమైందని గవర్నర్ విమర్శించారు.

తమిళనాడుకు ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కానీ మీరు (తెలంగాణ) నిద్ర పోయి, ఆలస్యంగా మేల్కొని అడిగితే ఎలా ? అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన మరో నెటిజన్ గతంలో ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల పత్రాన్ని ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల కోసం దరఖాస్తు చేయలేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారం ఉంటే షేర్ చేయాలని అడిగారు. నెటిజన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన గవర్నర్.. ఇందుకు సంబంధించి అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో సమాధానం ఇచ్చారని,  తెలంగాణ సమయానికి ప్రతిపాదనలు పంపలేదని మంత్రి పేర్కొన్నారని… చెప్పారు.

గవర్నర్ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించిన నెటిజన్లు.. కేంద్రం తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇచ్చిందని పేర్కొంటూ గతంలో ఆమె చేసిన ట్వీట్ లను షేర్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 9 వైద్య కళాశాలలు ఇచ్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ ను షేర్ చేసి, ఏం సమాధానం చెబుతారని గవర్నర్ ను ప్రశ్నిస్తున్నారు.

గవర్నర్ తమిళి సై ట్వీట్లకు మంత్రి హరీశ్ రావు తిప్పికొడుతూ అనేక ప్రతిపాదనలు పంపినా, వైద్య కళాశాలల కేటాయింపులో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్ర సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ లక్ష్యంతో రాష్ట్ర నిధులతో సీఎం కేసీఆర్ 12 కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles