ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న వివేకా హత్య కేసు!

Wednesday, December 25, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కమ్మనమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మూడోసారి సిబిఐ నోటీసులు జారీచేయడం కలకలం రేపుతున్నది. ఈ కేసును ముగింపు దశకు సీబీఐ తీసుకు వెడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

  తొలిసారి విచారణకు హాజరైనప్పుడు పలు ప్రశ్నలకు ఎంపీ సమాధానాలు చెప్పలేదు. రెండోసారి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటివేసినట్టు సమాచారం.. మొత్తం నాలుగు గంటల పాటు విచారిస్తే.. ఆయన కొన్నింటికే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను విచారణకు హాజరు కావాలి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. పులివెందుల లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ శనివారం సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 6వ తేదీన అంటే సోమవారం కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి వారి చెప్పి వెళ్లినట్టు సమాచారం.

ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. కాగా, వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. ఇక అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఇప్పటికే సీబీఐ అధికారుల తీరుపై వైసీపీ కీలక నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని ఆరోపిస్తూ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంత దారుణం మరొకటి ఉండదంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవిధమైన హెచ్చరికను జారీ చేశారు.

తాజాగా మరోసారి సీబీఐ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో మూడోసారి హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయమై వైసీపీ వర్గాలలో ఆందోళన కలుగుతుంది. సోమవారం రావడం తనకు కుదరదని, తర్వాత వస్తానంటూ సీబీఐ నోటీస్‌కు అవినాష్ సమాధానం ఇచ్చినా, సోమవారం ఖచ్చితంగా విచారణకు రావాల్సిందేనని అంటూ సీబీఐ పట్టుబట్టడం మరింత ఉద్విక్తతకు దారితీస్తుంది.

హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్లు గూగుల్ టేకౌట్ అనే అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం చేశారు? హత్యలో పాత్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలపై సీబీఐ ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సారి సీబీఐ ఏం ప్రశ్నిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles