జగన్ రూ 13 లక్షల కోట్ల పెట్టుబడుల రాజకీయం!

Saturday, October 5, 2024

ఏపీ ప్రభుత్వం రెండు రోజులపాటు అట్టహాసంగా విశాఖపట్టణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును జరిపింది. సదస్సు ముగింపు సభలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుమారుగా  రూ. 13 ల‌క్ష‌ల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు ఏపీ ప్ర‌భుత్వంతో ఈ సందర్భంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.

ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా గణాంకాలు వెల్లడించారు.

జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు సహితం వెనుకకు వెళ్ళిపోతున్నాయని వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం కోసమే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టం అవుతుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ను ఆదుకోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొనేటట్లు చేసినట్టు కూడా తెలుస్తున్నది.

అయితే ఈ సదస్సులో పాల్గొన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎవ్వరు కూడా నిర్దుష్టంగా కొత్తగా పెట్టె పెట్టుబడుల గురించి ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. కేవలం రాజకీయంగా వైఎస్ జగన్ ను ఆదుకోవడం కోసం ప్రసంగాలు చేసినట్లు కనిపిస్తున్నది.

పెట్టుబడులపై జగన్‌ సర్కారు మరీ అడ్డగోలుగా చేసిన ప్రకటనలు వినోదం కలిగిస్తున్నాయి. ఒప్పందాల్లో ఎన్ని పక్కాగా ఉన్నాయి? ఎన్ని కంపెనీలు వాస్తవికమైన ప్రతిపాదనలు ఇచ్చాయి? వాటిలో ఎన్ని అమలులోకి వస్తాయి? అన్నది ముందు ముందు గాని తెలియదు.

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లనే ప్రస్తావించారు. ప్రస్తుతం అమలులో ఉన్నవాటినే చెప్పుకొచ్చారు. సదస్సు ముందు రోజు వరకు రాష్త్రానికి రూ 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ సదస్సు జరుపుతున్నట్లు పలువురు మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాథ్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని సహితం విశాఖపట్నం నుండే అటువంటి ప్రకటనలు చేశారు.

అయితే, ఇప్పుడు సీఎం జగన్ ప్రకటన చూస్తుంటే ప్రభుత్వం అంచులకు మున్సి ఆరేడు రేట్లు ఎక్కువగా పెట్టుబడుల వర్షం కురిసినట్లు భావించవలసి వస్తుంది. రూ. 2 లక్షల కోట్ల అంచనా ఎక్కడ? రూ 13 లక్షల కోట్లు ఎక్కడ? ఈ రహస్యం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. రాజకీయ ప్రచారం కోసం చేసిన ప్రకటన మాదిరిగా కనిపిస్తుంటుంది.

పారిశ్రామిక వేత్తల ప్రకటనలు చూస్తుంటే వందలు, వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడారు గాని లక్ష కోట్ల రూపాయల ప్రసక్తి ఎవ్వరూ తేలేదు. కేవలం 352 ఒప్పందాలతో ఎన్ని వేల కోట్లు కలిపినా రూ 13 లక్షల కోట్లు యెట్లా అవుతాయో అంతుబట్టడం లేదు.

సదస్సులో హడావుడి చేసిన జీఎంఆర్ అధినేత మల్లికార్జున్ రావు భోగాపురం ఎయిర్ పోర్ట్ ద్వారా రూ. 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సర్కారుతో రాయితీ ఒప్పందం కుదుర్చుకుని మరికొన్ని నెలల్లో మూడేళ్లు కానుంది. కానీ ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఇప్పటి వరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.

మరొకటి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ 2023 ఫిబ్రవరిలోనే అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేసి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ తయారు చేస్తామని, ఇక్క్డడ మొత్తం రూ. 1 .10 లక్షల కోట్ల  పెట్టుబడులు పెడతామని, రూ. 55,000 కోట్లు చొప్పున  రెండు దశల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు ఎంఓ యు లో వీటికి కూడా చోటు కల్పించినట్లు సమాచారం.

అప్పులు తీర్చటానికి అదానీ గ్రూప్ ఇప్పుడు సొంత వాటాలు అమ్ముకుంటుంది. అలాంటిది అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 21,820 కోట్లు పెట్టుబడి అంటే అనుమానం కలగక మానదు. ఇక సీఎం జగన్ బంధువులు, సన్నిహితులకు చెందిన చిన్న చిన్న కంపెనీలు సహితం భారీ ఒప్పందాలు చేసుకోవడం కనిపిస్తుంది.

ఉదాహరణకు, లక్ష రూపాయల మూలధనంతో అన్‌లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న పులివెందులకు చెందిన వారి ఇండోసోల్‌  ఏకంగా రూ.76033 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles