కేసీఆర్ ను నవ్వులపాలు చేసిన ఫాక్స్ కాన్ పెట్టుబడులు!

Friday, December 27, 2024

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు, వాటి కారణంగా లక్ష మందికి ఉపాధి కలుగుతున్నట్లు హట్టహాసంగా ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్ చివరకు నవ్వులపాలు కావలసి వచ్చింది. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రగతి భవన్ లో భేటీ కావడం, ఆ తర్వాత కేటీఆర్ తో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో సంబరపడిపోయిన తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రచారం చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యా నుఫ్యాక్చర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన ‘ఫాక్స్‌కాన్’ ఇబ్రహీంపట్నంలో  ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు హై ఫాక్స్ కాన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. సిఎం సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైందని కూడా పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్  రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని కూడా చెప్పడం గమనార్హం.  పదేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పించడం అంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయి ఉండాలని అందరూ అనుకున్నారు.

అంటే, ఎన్నికల ముందు రాష్ట్రానికి పలు అంతర్జాతీయ కంపెనీల నుండి పెట్టుబడుల ప్రవాహం రాబోతున్నట్లు  ప్రజలను మభ్య పరచేందుకు ఇటువంటి ప్రచారం చేశారా అనే అభిప్రాయం కలుగుతుంది. ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ అంటే అందులో అంతా ఎక్కువ శాతం ఆటోమేటెడ్ మార్గంలో ఉత్పత్తి జరుగుతుంది. మనుషుల అవసరం తక్కువగా ఉంటుందని అందరికి తెలిసిందే.

ఆ మరుసటి రోజే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయితో కూడా ఆ కంపెనీ అధిపతి భేటీ కావడం, కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే విధంగా భారీగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తమ కంపెనీ చైర్మన్ యంగ్ లియూతో భేటీల తర్వాత ఈ విధంగా పెట్టుబడుల గురించి విస్తృత ప్రచారం చేసుకోవడం పట్ల ఫాక్స్ కాన్ విస్మయానికి గురైనట్లు కనిపిస్తున్నది.

అందుకనే ఈ విషయమై ఓ వివరణ మీడియాలో వచ్చింది. భారత్ లో కొత్త పెట్టుబడులకు సంబంధించి తాము అటు తెలంగాణతో కానీ, ఇటు కర్ణాటక తో కానీ ఎలాంటి ఖచ్చితమైన, కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఫాక్స్ కాన్ స్పష్టం చేసింది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి తమ చైర్మన్‌ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది.  కొత్త ఉద్యోగాలకు సంబంధించి తమ సంస్థ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

త్వరలో ఎన్నికలు రాబోతుండడంతో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తైవాన్ చైర్మన్ పర్యటనను సహితం తమ ప్రచారం కోసం ఉపయోగించుకొంటున్నారా? లేదా వారిద్దరి మధ్య పోటీపెట్టి మరిన్ని రాయితీలు పొందేందుకు ఆ కంపెనీ యాజమాన్యమే ఎత్తుగడ వేసిందా?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles