పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికే సవాల్ విసిరిన లోకేష్

Thursday, September 19, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో తిరుగులేని నేతగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ ఉనికి లేకుండా చేయడంకోసం ఎంతో శ్రమ పడుతున్నారు. చివరకు వరుసగా ఏడుసార్లు గెలుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే టీడీపీ లేకుండా చేసేందుకు అన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

మొత్తం పాలనా యంత్రాంగం ఆయన కనుసన్నలలో నడుస్తున్నది. చివరకు సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితులైన బి కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటివారు, మంత్రి పదవిలో ఉన్న రోజా సహితం ఆయన హల్ చల్ ముందు తలవంచవలసి వస్తుంది. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారని వందలాది మందిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయించారు.

అటువంటి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర చేరింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లోకేష్ హెచ్చరించారు. నీ అక్రమాలు ఇక సాగనివ్వనని అంటూ హెచ్చరించారు. తగ్గేది లేదు ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి అంటూ సవాల్ విసిరారు.

‘‘పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట… భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలి?’’ అని ప్రశ్నించారు. జిల్లాలో ఈ విధంగా పెద్దిరెడ్డిని నేరుగా నిలదీసింది మొదట లోకేష్ కావడం విశేషం. లోకేష్ సవాళ్ల పట్ల జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, శ్రేణులు సహితం హర్షం వ్యక్తంచేసే పరిస్థితి నెలకొంది.

అంతేకాకుండా, పెద్దిరెడ్డి అక్రమాలను సహితం లోకేష్ జనం మధ్యలో ప్రస్తావించి నిలదీశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి అమూల్ డైరీని తీసుకొచ్చారని,  కానీ పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని విమర్శించారు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ కోసమే అమూల్ ను ఇక్కడకు తీసుకురాలేదని దుయ్యబట్టారు.

పాలకు తక్కువ ధరను చెల్లిస్తూ పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తాగే నీళ్ళు లీటరు రూ.20 అమ్ముతున్న రోజుల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి లీటర్ పాలుకు రూ.16 ఇచ్చారన్నారు. చల్లా బాబు పోరాటంతో ఆ ధరను ఇప్పుడు పెంచినట్లు తెలిపారు. అయినా బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు.

అటవీశాఖకు చెందిన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. రిజర్వాయర్ కోసం బలవంతంగా భూములు లాక్కున్నారని, ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి తమ్ముడు కొడుకు సుధీర్ రెడ్డి  కంపెనీ కోసం మామిడి రైతులు పంట తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని చెబుతూ మామిడి రైతుల నుంచి మూడేళ్ల కాలంలో రూ 100 కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు. బయటివారికి మామిడి పంటను అమ్మకుండా అడ్డుపడుతున్నాడని తెలిపారు.

రూ. 10 వేల కోట్లను పాపాల పెద్దిరెడ్డి దోచుకున్నారని పేర్కొంటూ ఆయనను శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని, దోచుకున్నదంతా కక్కించి పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామని లోకేష్ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికలల్లో చంద్రబాబు అధికారమలోకి వస్తారని, పుంగనూరును ప్రక్షాళన చేసి పెద్దిరెడ్డికి చెక్ పెడతారని భరోసా ఇచ్చారు.

తాము అధికారంలోకి వచ్చాక మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని.. పుంగునూరు, పీలేరు, మదనపల్లిని మదనపల్లి జిల్లాలో కలుపుతామని ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles