అమిత్‌షాలో ఆశపుట్టించడంలో బండి సక్సెస్!

Monday, December 23, 2024

భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య మూడు. అది కూడా 2018 ఎన్నికలు జరిగినప్పుడు పొందిన బలం కాదు. అప్పట్లో ఒకేఒక స్థానం మాత్రం గెలిచిన బిజెపి, తరవాతి ఉపఎన్నికలలో రెండు చోట్ల గెలుపొంది తమ బలం 3 అని నిరూపించుకుంది. మూడు స్థానాల నుంచి ఈ ఎన్నికలు ముగిసేనాటికి అధికారం దక్కించుకునేలా కనీసం 60 స్థానాలకు చేరుకోవడం అంత సులభ సాధ్యమేనా? ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో తామే విజయం సాధిస్తామని బహిరంగ వేదికల మీద ఆ పార్టీ నాయకులు అందరూ చెబుతూ ఉండవచ్చు గాక, కానీ వాస్తవంలో ఆ పరిస్థితి లేదన్నది వారందరికీ తెలుసు! ఎంత కష్టపడినప్పటికీ మహా అయితే 30 స్థానాల వరకు చేరుకోగలం అని ఆ పార్టీ నాయకుల అంచనా!

తాజా పరిణామాలను గమనిస్తే మాత్రం ఆ అంచనాలను మించి అధికారం కూడా దక్కుతుందేమోననే ఆశ ఆ పార్టీలో పుడుతున్నట్లుగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తిగా తెలంగాణలోనే తిష్టవేసి, ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ పూనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. తాను ఆ స్థాయిలో శ్రద్ధ పెడితే అధికారం దక్కుతుందనే ఆశ ఆయనలో పుట్టినట్టే ఉంది. మరో కోణంలో చూసినప్పుడు తమ పార్టీ కేంద్ర నాయకత్వంలో- అలాంటి ఆశ పుట్టించడంలో రాష్ట్ర బిజెపి నాయకులు, ప్రత్యేకించి బండి సంజయ్ కృతకృత్యులు అయ్యారనే చెప్పాలి.

వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకోవడానికి బిజెపి చాలా పెద్ద యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాతినుంచిఅమిత్ షా పూర్తిగా తెలంగాణలోనే ఉంటారని వార్తలు వస్తున్నాయి. ప్రతి వారం ఒక్కొక్క నాయకుడి ఇంటిలో- రాష్ట్ర నాయకులు అందరితోనూ సమావేశం అవుతూ వ్యూహరచనలు చేస్తూ గెలుపు దిశగా దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో వేడి పుట్టడం మాత్రమే కాదు ప్రజల ఆలోచనల్లో కూడా కొంత మార్పు వస్తుంది. కేంద్ర నాయకత్వం అంతగా శ్రద్ధ పెడుతున్నదంటే ఎంతో కొంత వారికి సానుకూల పవనాలు ఉన్నాయేమో అనే అభిప్రాయం తటస్థులలోనూ ఏర్పడుతుంది. ఇది ఈ దశలో భారతీయ జనతా పార్టీకి చాలా లాభం కలిగించగల ఆలోచన.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఫోకస్ పెట్టడం అంటే.. కేసీఆర్ ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేయడమే. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు తనకు పట్టవన్నట్టుగా, వారసుల చేతిలో పెట్టేసినట్టుగా, తాను పూర్తిగా దేశ రాజకీయాల మాత్రమే పట్టించుకునేలా కేసీఆర్ తమ కుటుంబానికి పని విభజన చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలమీద పెద్దగా  దృష్టి సారించకుండా, రాష్ట్ర రాజకీయాల మీద నుంచి పక్కకు మరలకుండా ఉండేలా తాము ఒత్తిడి పెట్టాలనేది కమలదళం వ్యూహంలా కనిపిస్తోంది. ఇందులో వారు ఎంతమేర సక్సెస్ అవుతారో.. అమిత్ షా హైదరాబాదులోనే తిష్టవేసి పార్టీని ముందుకు నడిపించడం ఎంత మేర కుదురుతుందో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles