జగన్ నోట.. మళ్లీ మళ్లీ అదే పాట! ఎందుకలగ?

Saturday, November 23, 2024

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం అయింది. ఎక్కడెక్కడినుంచో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎందరో వచ్చారు. రెండురోజుల్లో సుమారు 350 ఎంఓయూలు , సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదరబోతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది. అయితే అడిగినా అడగకపోయినా.. విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలివచ్చేస్తుందని, త్వరలో తాను విశాఖనుంచే పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. చూడబోతే.. విశాఖే రాజధాని అని తన నోటితో తాను స్వయంగా పదేపదే ప్రకటించడానికి మాత్రమే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు పెట్టినట్టుగా ఉంది. 

సాధారణంగా ఇలాంటి ఇన్వెస్టర్స్ సదస్సులు నిర్వహించేప్పుడు.. రాష్ట్రంలో వనరుల పరంగా లభ్యత గురించి, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కల్పించే సదుపాయాల గురించి ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎలాంటి వివరాలు వెల్లడించడం వలన పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారో.. అలాంటి వివరాలను చెప్పడానికే పాలకులు శ్రద్ధ పెడతారు. 

ఆ కోణంలోంచి చూసినప్పుడు.. రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి అనేది పెట్టుబడిదారులకు అవసరం గానీ, రాజధాని ఎక్కడ ఉంటుంది? అనేది వారికి ఎప్పటికీ ప్రయారిటీ కానే కాదు. నిత్యం రాజధాని నగరం, అక్కడి అధికారుల వ్యవస్థలు, సెక్రటేరియేట్ కార్యకలాపాలతో పనులు ఉండే వారికి మాత్రమే రాజధాని ఎక్కడ ఉంటుందనే విషయం అవసరం. పారిశ్రామికవేత్తలకు అది అక్కర్లేదు. తాము పెట్టదలచుకున్న పరిశ్రమకు వనరుల లభ్యత పరంగా, రవాణా మార్గాల పరంగా, మానవ వనరుల లభ్యత పరంగా ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయో వారు చెక్ చేసుకుంటారు. రాజధాని ఎక్కడ ఉన్నా వారికి పరవాలేదు. 

కేవలం రాజధాని అనే పదం ట్రంప్ కార్డులాగా వాడుకుంటూ రియల్ ఎస్టేట్ దందాలు నడిపించే వారికి మాత్రమే దానితో పని ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన సరళి ఎలా ఉన్నదో మనకు తెలియదు గానీ.. ఆయన ప్రతి దానికీ పదేపదే , విశాఖకు త్వరలో రాజధాని వచ్చేస్తుంది అనే మాటను.. పెట్టుబడిదార్లను ఆకర్షించడానికి వాడుతున్నారు. ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇవాళ సమ్మిట్ ప్రారంభ సదస్సులో కూడా అదే హామీ ఇచ్చారు. కానీ.. ఇది ఏమాత్రం పనిచేస్తుంది అనేది సందేహమే.

రాజధానిని విశాఖకు తరలించడం అనేది జగన్ డ్రీమ్ అయిఉండొచ్చు. కానీ.. పెట్టుబడిదారులందరికీ అదొక గొప్ప వరంలాగా ఎందుకు అనిపిస్తుంది? ఈ లాజిక్ ను ముఖ్యమంత్రి  మిస్సవుతున్నారు. నిజానికి సుప్రీం కోర్టులో పిటిషన్ లు ఒక పట్టాన తెగకపోతుండగా, జగన్ లో అసహనం పెరుగుతున్నట్లుంది. మరింత ఎక్కువగా ఆయన స్వయంగా రాజధాని ప్రకటన చేస్తున్నారు. సుప్రీం కోర్టులో తీర్పు రాజధాని విషయంలో తన కలలకు భిన్నంగా వస్తే గనుక.. ఆ అసహనంలో జగన్ అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరడానికి ఎన్నికలకు వెళ్లినా వెళ్లవచ్చునని, అంత పట్టుదలగా ఉన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles