క్రియాశీల రాజకీయాల నుండి గవర్నర్ గా వచ్చిన్నప్పటి నుండి రాజ్ భవన్ కు పరిమితం కావలసి రావడం, కేసీఆర్ ప్రభుత్వం తన ఉనికినే గుర్తింపన్నట్లు వ్యవహరిస్తూ ఉండటం పట్ల అసహనంగా వ్యవహరిస్తున్న తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ 2024 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
అందుకనే ఆమె తరచూ తమిళనాడులో పర్యటనలు జరుపుతున్నారు. ఈ మధ్యనే అక్కడ ఒక సభలో మాట్లాడుతూ తనకు ప్రజలు ఓట్లు వేయకపోవడం వల్లననే రాజ్ భవన్ కు పరిమితం కావలసి వచ్చిమదని, లేనిపక్షంలో పార్లమెంట్ సభ్యురాలిగా ఉండేదానిని అంటూ బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంపీగా కేంద్ర మంత్రి కావచ్చని ఆమె భావిస్తున్నారు.
ఈ మధ్య గవర్నర్ల మార్పులు, కొత్తవారి నియామకం పెద్ద ఎత్తున జరిగిన సమయంలో ఆమెను తెలంగాణ నుండి మార్చవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలను కలుసుకొని వచ్చారు. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు వారు సహితం ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది.
అన్నాడీఎంకేతో పొత్తు ఉండడంతో తేలికగా గెలుపొందవచ్చని అంచనా వేస్తున్నారు. పైగా, కోయింబత్తుర్ నుండి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ను ఇటీవల ఝార్ఖండ్ గవర్నర్ గా నియమించడంతో ఆ సీటు నుండి పోటీచేయాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు చెప్పుకోదగిన బలం కూడా ఉంది.
లోక్ సభకు పోటీచేయడం ఖరారైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. వ్యూహాత్మకంగా ఆమె కేసీఆర్ ప్రభుత్వం పట్ల గత నెలరోజులుగా ఘర్షణ ధోరణిని విడనాడటం గమనార్హం. బడ్జెట్ సమావేశాలకు ఆమోదం తెలిపే విషయంలో మొండిగా వ్యవహరించి, హైకోర్టు వరకు ప్రభుత్వం వెళ్ళేటట్లు ఆమె చేయడం తెలిసిందే.
అయితే, హైకోర్టు సున్నితంగా మందలించి, హెచ్చరికలు చేయడంతో రెండువైపులా న్యాయవాదుల ద్వారా రాజీకీ వచ్చారు. తాజాగా, పంజాబ్ బడ్జెట్ సమావేశాల విషయంలో అక్కడి గవర్నర్ అదేవిధంగా వ్యవహరిస్తే, సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఆమోదం తెలిపే విషయంలో న్యాయ సలహా కోరనున్నట్లు తెలపడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
మంత్రివర్గం నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించవలసిందే అని స్పష్టం చేసింది. ఒక విధంగా న్యాయ స్థానాల నుండి ఆ విధమైన అక్షింతలు వేసుకోకుండా డా. తమిళసై తప్పుకున్నట్లయింది.