టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం నేండ్రగుంట వద్ద 400 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. 4 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యేంత వరకు తాను విశ్రమించబోనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు పాదయాత్రపై పోలీసులు 12 కేసులు నమోదు చేశారని చెబుతూ అంటే సగటున ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదయిందని ఎద్దేవా చేశారు. జిఓ -1 ద్వారా అడుగడుగునా తన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలని చూసినా ప్రజల ఆశీస్సులతో 400 కిలోమీటర్లు పూర్తిచేశానని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా 4వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. 10 నియోజకవర్గాల మీదుగా సాగిన యువగళం పాదయాత్రపై ఇప్పటివరకు పోలీసులు 12 కేసులు నమోదు చేశారు.
9 కేసుల్లో పోలీసులే ఫిర్యాదుదారులుగా ఉండటంతో చూస్తే పోలీసులను అడ్డంపెట్టుకొని యాత్రను ఏవిధంగా అడ్డుకోవాలని చూస్తున్నారో అర్థమవుతోందని లోకేష్ ధ్వజమెత్తారు. విఆర్ఓ ఫిర్యాదుపై ఒకటి, ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదులపై 2 కేసులు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ లో లోకేష్ తోపాటు అచ్చెన్నాయుడు, అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని, దీపక్ రెడ్డి తదితర 55 మందికి పైగా టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, జిడి నెల్లూరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల మీదుగా ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగింది. కుప్పం, భైరెడ్డిపల్లి, పలమనేరు, నర్సింగరాయనిపేట, నగరి, శ్రీకాళహస్తీలలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు. బంగారుపాళ్యం, ఎస్ఆర్ పురం, ఏర్పేడులో 2కేసుల చొప్పున నమోదయ్యాయి.
జగన్ పాలనలో 10లక్షల ఉద్యోగాలు హాంఫట్!
గల్లా జయదేవ్ ను వైసీపీలోకి ఆహ్వానించినా వెళ్లలేదని పేర్కొంటూ జగన్ అమర్ రాజా కంపెనీని పక్క రాష్ట్రానికి తరిమేశాడని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీని తెచ్చానని గుర్తు చేస్తూ 50 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా తాను ఒప్పందం చేసుకుంటే ..జగన్ దాన్ని పక్క రాష్ట్రానికి తరిమేశాడని ధ్వజమెత్తారు.
జగన్ పాలనలో 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలను మన యువత కోల్పోయారని లోకేష్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీకి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఐటీ కంపెనీ తెచ్చే విషయాన్ని పక్కనబెడితే ఆ కంపెనీలకు విద్యుత్ సరఫరా ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.