ఇద్దరు కీలక నాయకులు అరెస్టు అయ్యారు. అయినా సరే వారు మంత్రి పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు. సహజంగానే ఈ పరిస్థితిని రాజకీయ ప్రత్యర్థులు తమకు ఎడ్వాంటేజీగా మార్చుకోవడానికి చూస్తారు. బిజెపి కూడా అదే పని చేసింది. ఇదివరకటి మంత్రి విషయంలో లాగా నిమ్మళంగా ఉండకుండా, అరవింద్ కేజ్రీవాల్ కాస్త వెంటనే మేలుకున్నారు. సిసోడియా అరెస్టు అయిన రెండోరోజునే ఆయనతో రాజీనామా చేయించారు. గతంలో అరెస్టు అయిన సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. పార్టీ పరువు కాపాడడానికి ఈ ఇద్దరు నాయకులు తమ మంత్రి పదవులను త్యాగం చేసి ఉండవచ్చు గాక.. కానీ ఆ త్యాగాలతో పార్టీకి అంటిన కళంకం మాసిపోతుందా? అనేది ప్రశ్న.
సిసోడియా వ్యవహారం ఇప్పుడు రాద్ధాంతం అవుతున్నది గానీ.. పార్టీలో సిసోడియా తర్వాత అంతటి కీలక వ్యక్తి అయిన మంత్రి సత్యేంద్రజైన్ కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి జైల్లో ఉండిపోతే మరి పరిపాలన ఎలా? నిజానికి, అరవింద్ కేజ్రీవాల్ కు అలాంటి చింత ఉన్నట్టు లేదు. జైన్ శాఖలన్నింటినీ ఆయన సిసోడియా చేతిలోనే పెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఈ రాజీనామాల ముందువరకు మనీష్ సిసోడియా ఏకంగా 18 శాఖలు నిర్వహిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఆ రకంగా జైన్ ను కేబినెట్ నుంచి తప్పించడం గురించి పట్టించుకోకుండా ఉండిపోయిన కేజ్రీవాల్ కు ఇప్పుడు తప్పలేదు. సిసోడియా కూడా అరెస్టు అయ్యాక, విపక్షాల విమర్శలు పెరిగాక, వేరే గత్యంతరం లేని స్థితిలో ఈ ఇద్దరితో రాజీనామాలు చేయించినట్లుగా కనిపిస్తోంది. వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకోకపోవడం అనేది వ్యూహాత్మక నిర్ణయం కావొచ్చు. వారితో రాజీనామాలు చేయించడం అనేది తాము నేరం ఒప్పుకుంటున్నట్టు కాదని పరిపాలన పరమైన ఇబ్బందులు రాకుండానే ఈ పనిచేస్తున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు. వారిద్దరి రాజీనామాలను కూడా ఆమోదించేశారు. ఆ రెండు శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అప్పగించారు.
మంత్రులతో రాజీనామాలు చేయించారు సరే.. వీటివలన ఆమ్ ఆద్మీ పార్టీకి అంటిన కళంకం పూర్తిగా తొలగిపోతుందా? అనేది ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్న. రాజీనామా తర్వాత సిసోడియా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను అవినీతి పరుడిని కాను అని చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు. అయితే ‘వారి టార్గెట్ నేను కాదు. కేజ్రీవాల్ మాత్రమే’ అని సిసోడియా అనడం గమనార్హం. ఆయన ఆ మాటలు అనడానికి రెండు రోజుల ముందునుంచే .. సిసోడియా విచారణ తర్వాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కూడా విచారణ నోటీసులు అందుతాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సిసోడియా మాటలను బట్టి కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారా అనిపిస్తోంది. ఇవాళ నన్ను అరెస్టు చేస్తారు- అని సిసోడియా ప్రకటించినట్టే అదేరోజున అరెస్టు జరిగింది. అదే తరహాలో.. ఆయన చెప్పినట్టుగా కేజ్రీవాల్ ను కూడా టార్గెట్ చేసి అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
ఈ త్యాగాలు కళంకాన్ని చెరపివేస్తాయా?
Wednesday, November 13, 2024