వివేకా హత్య కేసులో దారి మళ్ళించడం కోసం `లవ్ జిహాద్’ కోణం!

Saturday, November 23, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దారి మళ్ళించడం కోసం మొదటి నుండి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. మొదట్లో హృద్రోగంతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కడప జిల్లాలోని టిడిపి ప్రముఖులు కలిసి చంపించారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 2019 ఎన్నికలలో ఆ మేరకు కొంతవరకు లబ్ధి కూడా పొందారు.

అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేసు విచారణనే నీరుగార్చే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం మొదటిరోజు నుండి చేస్తున్నారు. అయితే వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి పట్టుదలగా అటు సుప్రీంకోర్టులో, ఇటు సిబిఐ జాతీయ కార్యాలయంలో పోరాటం జరపడంతో చివరకు కేసు విచారణ ఏపీ నుండి హైదరాబాద్ కు బదిలీ కావడంతో దర్యాప్తు వేగం పుంజుకొంది.

సిబిఐ అనూహ్యంగా ఆధునిక సాంకేతికతను ఆసరా చేసుకొని గూగుల్‌ టేకౌట్‌ ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మొబైల్ కాల్ డాటాను వైట్లకు తీసి, నేరం జరిగిన తీరును బట్టబయలు చేస్తుండడంతో ఖంగు తిన్నారు. స్పష్టంగా కడప లోక్ సభ సీట్ విషయంలో పోటీ రాకుండా ఉండేందుకే అవినాష్ రెడ్డి ఈ హత్యకు సూత్రధారిగా ఉన్నారని సిబిఐ చెబుతుంటే, రాజకీయాలతో సంబంధం లేదనే వాదనలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

హత్య కేసులో రెండో నిందితుడు (ఏ-2) సునీల్‌ యాదవ్‌కు దాఖలు చేసుకున్న  బెయిల్‌ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదనలో మొదటిసారిగా `లవ్ జిహాద్’ అంటూ సరికొత్త కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డి కుటుంభం సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల్లో జరిగిన ఘర్షణగా చిత్రీకరించే కుట్రపూరిత ప్రయత్నం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

వివేకా హత్యకు రాజకీయ కారణాలు లేవని.. ఓ ముస్లిం యువతి కారణంగా హత్య జరిగిందని  సునీల్ యాదవ్ న్యాయవాది టి.నయన్‌కుమార్‌రెడ్ వాదించారు. హత్యకు గురైన వివేకాకు ఓ ముస్లిం మహిళతో అక్రమ సంబంధం ఉందని స్వయంగా సౌభాగ్యమ్మ తమ్ముడు, సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. హనీట్రా్‌పలో భాగంగానే వివేకా హత్య జరిగి ఉండవచ్చని అంటూ ఇది సింహాల మధ్య పోరాటమని, తన క్లయింట్‌ చిట్టెలుకనని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.

‘వివేకానంద రెడ్డి హత్య రాజకీయ కారణాలతో జరగలేదు. ఓ ముస్లిం యువతి వల్ల జరిగింది. అది వలపు వల. లవ్‌ జిహాద్‌. వివేకా హత్య తర్వాత ఆ ఇంట్లో తన భార్యకు చాలా కాగితాలు లభించాయని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలంలో చెప్పారు. షేక్‌ షమీకి రూ.8 కోట్లు ఇవ్వాలని వాటిలో వివేకా నోట్‌ చేశారని పేర్కొన్నారు. షేక్‌ షమీకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అఫ్జల్‌ఖాన్‌కు రూ.12.5 కోట్లు ఇవ్వాలని.. వాటిలో రూ.8 కోట్లు షమీకి ఇవ్వాలని ఉంది. షబానా, రజియా, సుల్తానాతోనూ ఆయనకు సంబంధం ఉందన్నారు. షేక్‌ షమీ సోదరిని.. సుధీర్‌రెడ్డికి ఇచ్చి వివేకా పెళ్లి జరిపించారు. ఇదో లవ్‌ జిహాద్‌’ అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్త కధనం కోర్టు ముందుకు తీసుకు వచ్చారు.

సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీ నాగేంద్రన్‌ వాదనలు వినిపిస్తూ తాను అమాయకుడినని, హత్యతో సంబంధం లేదని సునీల్‌ అంటున్నారని.. ఏ సంబంధమూ లేని వ్యక్తి గోవాకు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. గూగుల్‌ టేకౌట్‌ ద్వారా వివరాలు సేకరించి గోవాలో అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితుడు సీబీఐకి ఏమాత్రం సహకరించలేదని తెలిపారు.

‘హత్యకు ముందు వివేకా నోటిపై మొట్టమొదట సునీల్‌ యాదవే కొట్టారు. తర్వాతే గొడ్డలు వేటు పడింది. వివేకా డ్రైవర్‌ ప్రసాద్‌ మీద నెట్టేందుకు లేఖ రాయించారు. ప్రసాదే చంపాడని కేసును ట్విస్ట్‌ చేయాలని చూశారు. సునీల్‌ పాత్రపై ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి’ అని స్పష్టం చేశారు.

కాగా, ‘నిందితుడికి అర్ధరాత్రి వివేకా ఇంటి వద్ద ఏం పని’ అని ఇంప్లీడ్‌ పిటిషనర్‌ సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ ప్రశ్నించారు. ఒక నిండు ప్రాణాన్ని బలిగొని.. రాజ్యాంగం ప్రకారం తనకు స్వేచ్ఛ ఉందని ఎలా అంటారని ప్రశ్నించారు. గంగాధర్‌రెడ్డి అనే సాక్షి ఇప్పటికే అనుమానాస్పదంగా చనిపోయాడని.. సీఐ శంకరయ్యను సస్పెండ్‌ చేసి మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ సాక్షులను బెదిరించడంలో భాగంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles