నందమూరి తారకరత్న సినిమాపరంగా చెప్పుకోదగిన విజయం సాధింపలేకపోయినా ఆయన అకాలమరణం చెందటం నందమూరి కుటుంబంలో, టిడిపి శ్రేణులలోనే కాకుండా సాధారణ ప్రజలలో సహితం విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా తారకరత్న నిజాయితీ, స్నేహ స్వభావం, కష్టించి పనిచేయడం వంటి మంచి లక్షణాల గురించి చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.
చిన్నప్పటి నుండి టిడిపి ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటున్నా ఇటీవలనే ఆ పార్టీలో క్రియాశీల పాత్ర వహించేందుకు సిద్దపడుతున్నారు. యువనేత నారా లోకేష్ కు చేదోడుగా నిలబడేందుకు సరికొత్త యాత్ర ప్రారంభించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేయాలని తన అభిలాషను బహిరంగంగా వెల్లడించారు.
ఎన్నికలలో పోటీచేసే విషయమై లోకేష్ తోనే కాకుండా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలతో కూడా చర్చించారని, పోటీచేసే నియోజకవర్గం గురించి కూడా సమాలోచనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటువంటి సమయంలో మృతిచెంటం అంతటా విషాదం నింపింది. అయితే, ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి కూడా ప్రముఖంగా వార్తలలో నిలబడటం జరుగుతుంది.
వృత్తిపరంగా చురుకైన వ్యక్తి అయినా వ్యక్తిగత జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఇప్పుడిప్పుడే జీవితం ఒక గాడిన పడుతున్న సమయంలో భర్త దూరం కావడం అందరినీ కలచివేస్తున్నది. ఈ సందర్భంగా ఆమెకు కొండంత అండగా ఉంటామని బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ వస్తున్నారు.
కుటుంబ సభ్యులు , స్నేహితులు ఎంత నచ్చ చెప్పిన ఆమె విషాదం నుండి బయటకు రాలేకపోతుంది. ఇటువంటి తరుణంలో బాలకృష్ణ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తారకరత్న కోరిక తీర్చాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలలో తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో, తారకరత్నకు ఇవ్వాలి అనుకున్న అవకాశాన్ని అలేఖ్య రెడ్డికి ఇవ్వాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం.
ఇక ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పి టీడీపీ పార్టీ మహిళా విభాగంలో ఆమెకి కీలక పదవి ఇవ్వాలని, వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
తారకరత్న పైన ప్రజల్లో ఉన్న అభిమానం నేపథ్యంలో అలేఖ్య రెడ్డిని కూడా ప్రజలు ఆదరిస్తారని, ఇక ఇదే సమయంలో అలేఖ్య రెడ్డి రాజకీయాలలో బిజీ అయితే కాస్త తారకరత్నలేని బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారు. పైగా, చురుకైన మహిళ కావడం, సమస్యలకు తట్టుకొని నిలబడే ధైర్యసాహసాలు కూడా ఉన్నాయని ఇప్పటికే నిరూపితం కావడంతో రాజకీయాలలో రాగాల ఆటుపోట్లను కూడా తగ్గుకోగలరని భావిస్తున్నారు.
అయితే, బాలకృష్ణ ఈ విషయంలో తన ఆలోచనల గురించి ఇంకా బహిరంగపడలేదు. అలేఖ్యా రెడ్డి సహితం వెంటనే రాజకీయరంగ ప్రవేశం గురించి ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండకపోవచ్చు. కొద్దీ నెలలు గడిస్తేగాని ఈ విషయంలో ఒకవిధమైన స్పష్టత వచ్చే అవకాశం ఉండదు.