వివేకా హత్య కేసులో రూ 40 కోట్ల సూపారిపై సిబిఐ దృష్టి

Thursday, December 19, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. హత్యకు  పథక రచన చేసిన సూత్రధారులేవరో తేలిపోయిందని ఇటీవల జరుగుతున్న విచారణల ధోరణి స్పష్టం చేస్తున్నది. ఇక హత్యా పథకాన్ని అమలుచేసిన వారు ఇప్పటికే జైలులోనో, బెయిల్ పైనో ఉన్నారు.

ఇప్పుడిక అసలు ఈ హత్యకు మూలం ఎవ్వరో తేల్చుకొనే పనిలో పడ్డారని చెబుతున్నారు. ముఖ్యంగా హంతకులకు రూ 40 కోట్ల సుపారీ ఇవ్వజూపారని, అందులో కొంత మొత్తం కూడా ఇచ్చారని నిందితులు చెబుతున్న దృష్ట్యా అంత పెద్ద మొత్తం ఖర్చు చేయగలిగింది ఎవ్వరో అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు కనిపిస్తున్నది.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండోసారి సిబిఐ విచారించినప్పుడు సహితం ఈ అంశం పైననే ఎక్కువగా ప్రశ్నించినట్లు భావిస్తున్నారు.  హత్య కు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని చెప్పింది ఎవ్వరు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన సునీల్ యాదవ్ బెయిల్ అభ్యంతర  పిటీషన్ లో హత్య చేసిన వారెవ్వరో, వారిని ప్రేరేపించినా లెవెల్ వన్ సూత్రధారులు ఎవ్వరో పేర్లతో సహా బైటకు వచ్చాయి. ఇప్పుడు వారి వెనుక అసలు సూతధారులెవరో తెలియాల్సి ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు.

సిబిఐ కథనం మేరకు వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి  రూ. 40 కోట్ల డీల్ కుదిరిందని సునీల్ యాదవ్, దస్తగిరిలతో ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. ఒక్కొక్కరికి తమ వాటా కింద రూ. 5 కోట్లు లభిస్తాయని, అడ్వాన్సుగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చారని పేర్కొన్నారు. దస్తగిరికి ఇచ్చిన కోటి రూపాయలలో సునీల్ యాదవ్ రూ. 25 లక్షలు తీసుకొని, రూ. 75 లక్షలు మాత్రమే ఆయనకు ఇవ్వడం జరిగిందని వెల్లడైంది.

దస్తగిరి ఓ రూ. 40 లక్షలను మున్నా అనే చెప్పుల దుకాణం యజమానికి ఇవ్వగా, వాటిని ఆయన లాకర్లో భద్రంగా దాచి పెట్టారు. సిబిఐ అధికారులు తరువాత ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ఇప్పుడు హత్య చేయడానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది ఎవరో చెలుసుకొనేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తున్నది.

అప్పట్లో రూ. 40 కోట్ల అంటే పెద్ద మొత్తమే. ప్రస్తుతం సిబిఐ విచారిస్తున్న వారెవ్వరూ అంత పెద్ద మొత్తం సర్దుబాటు చేయగల స్తోమతు గలవారు లేరు. దానితో మరొకొందరు కీలకమైన వ్యక్తులను సహితం సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

 కాగా, సిబిఐ పరిశీలించి, పరిశోధించగా వైఎస్ వివేకా హత్యకు సూత్రధారులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లేనని తేలిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఇప్పటికే శివ శంకర్ రెడ్డి ని అరెస్టు చేశారని, మిగిలిన ముగ్గురిలో ముగ్గురిని ఒకేసారి అరెస్టు చేస్తారా?, లేకపోతే ఒకరిని ఇద్దరినీ అరెస్టు చేస్తారా అన్నది తెలియాల్సి ఉందన్నారు.

సిబిఐకి అరెస్టు చేసే ఉద్దేశమే లేకపోతే, హైకోర్టులో సునీల్ కుమార్ బెయిల్ అభ్యంతర పిటిషన్ పై ఈ విషయాలన్నీ ప్రస్తావించి ఉండేవారు కాదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరిని అరెస్టు చేయకపోతే ప్రజలకు అనుమానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles