రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగవలసిన ఆస్తుల విభజన గురించి కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయడం గాని, పరస్పరం అవగాహనతో ఆ పక్రియను పూర్తిచేసే ప్రయత్నం చేయడం గాని చేయడం లేదు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉంటూ ఉండడంతో రాజకీయంగా తమకు ఎటువంటి ప్రయోగాజనం కలిగించని ఆస్తుల విభజన గురించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. దానితో విభజన చట్టం ఫలాలను తెలుగు రాష్ట్రాలు అందుకోలేకపోయాయి.
దేశం అంతటా బిజెపి గాలులు వీస్తున్నా తెలుగు ప్రజలు మాత్రం తమకు పట్టం గట్టడంలేదని కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారం అంతకంతకూ ముదురుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది.
అనేక సందర్భాల్లో ప్రధానిని కలిసి వినతి పత్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు- 91 సంస్థలను, అదేవిధంగా షెడ్యూల్ 10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌తో పాటు- 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది.
కానీ కేంద్రం దేన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో షీలా బీడే కమిటీ- 68 సంస్థలకు చెందిన ఆస్తులను పాక్షికంగా పంచింది. కానీ రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై బీడే కమిట చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని అధికారులు చెబున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా, సమస్యాత్మకంగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. తెలుగు యూనివర్సిటీ-, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ-ల విభజన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సమస్య కొనసాగుతూనే ఉంది.
రెండు ప్రభుత్వాలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించలేని క్రమంలో అప్పట్లో కేంద్రం నియమించిన కమిటీలు కూడా సరిగ్గా పనిచేయలేక పోతున్నాయి. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పా-టైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటి విభజన పూర్తిగా జరగలేదు.
ఫిల్మ్ డెవలప్‌మెంట్, టీఎస్ ఎంఎస్‌ఐడీసీ, మినరల్ డెవలప్మెంట్ సంస్థ వంటి ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. 2014 నుండి, చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో మొత్తం 29 సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.