మోసపోలేం.. కాంగ్రెస్ హామీని నమ్మేదెలా?

Friday, September 20, 2024

 అవసాన దశలో ఉన్నప్పుడు అందరూ నీతులు మాత్రమే మాట్లాడతారు.   అవకాశం లేనప్పుడు ప్రతి ఒక్కరూ పాతివ్రత్య డైలాగులు మాత్రమే వల్లిస్తారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో చేసిన తీర్మానం తెలుగు ప్రజలకు ఈ సత్యాన్ని గుర్తు చేస్తోంది.  పొత్తులతో మాత్రమే ఈ దఫా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అని ఏఐసీసీ సారథి మల్లికార్జున కరిగే చాలా స్పష్టంగా ప్రకటించారు.  బిజెపిని ఓడించేందుకు భావ సారూప్యత ఉన్న పార్టీలతో  కలిసి ముందుకు వెళదాం అని ఆయన ప్రకటించారు.  ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఔదార్యంతో తీసుకున్న నిర్ణయం అనుకోవడానికి వీల్లేదు..  నిజం చెప్పాలంటే,  దేశవ్యాప్తంగా పొత్తులు పెట్టుకోవడం మినహా ఆ పార్టీకి వేరే గత్యంతరం కూడా లేదు.

 ప్లీనరీ సమావేశాల రాజకీయ తీర్మానంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది.  పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలనే తమ హామీకి ఇంకా కట్టుబడి ఉన్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శవాసనం వేసి ఉన్న ప్రస్తుత సమయంలో..  ఎంతో కొంత తిరిగి ఊపిరి పోయడానికి ఇలాంటి ఎర వేశారని అనుకోవాలా?  లేదా,  నిజంగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 

 ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు.   మొక్కుబడిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హోదా డిమాండ్ ను వినిపించడం తప్ప..  తమ ఇచ్చిన హామీని,  తర్వాతి ప్రభుత్వం నెరవేర్చి తీరాలని,  రాహుల్ గాంధీ గానీ,  హామీ ఇచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గాని ఏనాడు పార్లమెంటులో పట్టుబట్టలేదు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు..  ప్రత్యేక హోదా అనేది మా పార్టీ మాత్రమే ఇస్తుంది అని ఒక పడికట్టు డైలాగు వేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది.

ఇప్పుడు ఎన్నికలు మరొక ఏడాది దూరంలో ఉండగా ప్లీనరీ రాజకీయ తీర్మానంలో కూడా హోదా మాట ప్రస్తావించడం గమనార్హం.  అయితే హోదాకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కట్టుబడి ఉన్నదో వారు తెలుగు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. . రాష్ట్రాన్ని విభజించి చేసిన ద్రోహానికి బేషరగా హోదా ఇస్తాం అని చెప్పాలి.  రాష్ట్రంలో మెజారిటీ సీట్లు ఇస్తే,  తమ పార్టీ సింగిల్ లార్జెస్ట్ హోదాలో కేంద్రంలో అధికారంలోకి వస్తే..  సంకీర్ణానికి తాము నాయకత్వం వహిస్తే..  లాంటి ‘ఇఫ్ క్లాజ్’  లు పెట్టి  ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాకుండా..  తాము భాగస్వామిగా ఉండే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం  అని స్పష్టంగా చెబితే తప్ప కాంగ్రెస్ నాయకుల మాటల నమ్మలేం. నాటకాలను కట్టిపెట్టి.. ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు తమకు లేదని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. అప్పటిదాకా వారు ఇలాంటి పనికిరాని తీర్మానాలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles